Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల, మాటల గారడీనే అని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బడ్జెట్‌లో ఏమీ చెప్పలేదని ఆరోపించారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని, రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమాకు నిధుల ప్రస్తావనే లేదని అన్నారు. రైతుబీమా, వడ్డీ లేని రుణాల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఎన్ని నిధులు కేటాయించారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలకు సంబంధించి కేటాయింపులు జరపలేదని, సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.28 వేల కోట్లు సరిపోవని అన్నారు. బీసీల సంక్షేమానికి కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, దీని ద్వారా బీసీలను మోసం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు
బడ్జెట్‌ను చూస్తే ఆరు గ్యారెంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అమలు కానట్లేనని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అసలు పస లేదని ఆరోపించారు. ఇదొక చెత్త బడ్జెట్ అని తీవ్ర విమర్శలు చేశారు.
అటు బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విమర్శలు కురిపించారు. 420 హామీలకు రూ.57 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, 60 రోజుల కాంగ్రెస్ పాలన అయోమయంగా ఉందని అన్నారు. మహాలక్ష్మి పథకానికే రూ.50 వేల కోట్లు అవసరం అవుతుందని, రైతుబంధు, ఆసరా, రుణమాఫీకి నిధులు ఎలా తెస్తారో చెప్పలేదన్నారు. రాజకీయ దురద్దేశాలతో హైదరాబాద్ అభివృద్దిని ఆపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని, అభివృద్ది దెబ్బతింటే రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదముందని హెచ్చరించారు. ఇవాళ తెలంగాణ భనన్‌లో హైదరాబాద్ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఇవ్వాల్సిన మొత్తం 50 వేల కోట్లపైనే ఉంటుందని, వీటిపై బడ్జెట్‌లో క్లారిటీ ఇవ్వలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బడ్జెట్ నిరాశజనకంగా ఉందని, సీఎం రేవంత్ బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలు సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అది నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ జల హక్కులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 13వ తేదీన నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు నిధులు కేటాయించలేదని ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శలకు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తోంది. ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమేనని, ఏప్రిల్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ఉంటుందని చెబుతోంది. ప్రతిపక్షాలు ఏదో ప్రభుత్వాన్ని తప్పుబట్టాలని విమర్శలు చేస్తున్నాయని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.