Amit Shah speech at Public Meeting at Khammam:
తెలంగాణ సాధన కోసం యువత ప్రాణ త్యాగాలు చేశారని, కానీ రజాకార్లతో కలిసి కేసీఆర్ కూర్చున్నారని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ రజాకార్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. కేసీఆర్ 9 ఏళ్లుగా రజాకర్లతో కలిసి పాలన కొనసాగిస్తున్నారని, ఆయనను సాగనంపాలంటే ప్రజలు బీజేపీకి మద్దతివ్వాలన్నారు. ఖమ్మంలో రైతు గోస బీజేపీ భరోసా సభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. ఒవైసీ మద్దతు కోసం రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలగా, కమలం వికసిస్తుందని చెప్పారు.  త్వరలో బీజేపీ సీఎం భద్రాద్రిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దీమా వ్యక్తం చేశారు.


ప్రధాని మోదీ పాలన, ప్రజల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి మూర్ఖపు చర్యలకు బీజేపీ శ్రేణులు భయపడవన్నారు. కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ను కేసీఆర్ అక్రమంగా నిర్బంధించారని.. ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారంటూ మండిపడ్డారు. కేసీఆర్ భక్తుల మనోభావాల్ని అర్థం చేసుకోవడం లేదు. కారు గుర్తు భద్రాచలం వద్దకు వస్తుంది కానీ, ఆలయంలో అడుగుపెట్టదన్నారు. ఎందుకంటే కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. త్వరలో బీజేపీ సీఎం భద్రాచలంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి పొత్తు లేదని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పాలన కారణంగా తెలంగాణలోనూ సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. 


కాంగ్రెస్ 4జీ పార్టీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ..
కాంగ్రెస్ అంటే వంశపారపర్యంగా పాలించే 4జీ పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ 2జీ పార్టీ అన్నారు అమిత్ షా. కాంగ్రెస్ అంటే జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీ అన్నారు. ఒవైసీ పార్టీ ఎంఐఎం 3జీ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ అయితే కేసీఆర్, కేటీఆర్ తో 2జీ పార్టీగా ఉందని సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చేది 2జీ, 3జీ, 4జీ పార్టీలు కాదని, ప్రజల పార్టీ నరేంద్ర మోదీ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. 



సీఎం కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూల్ ఇళ్లులు కట్టించలేదని, రైతులకు రుణాలు మాఫీ చేయలేదని, అన్ని వర్గాలను 9 ఏళ్లుగా మోసం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ రైతుల కోసం బడ్జెట్ లో కేవలం 20 వేల కోట్లు పెడితే.. ప్రధాని మోదీ రైతుల కోసం లక్ష కోట్ల బడ్జెట్ తెచ్చారన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించిందన్నారు. బియ్యం మీద కనీస మద్దతు ధర 67శాతం పెంచింది బీజేపీ ప్రభుత్వం. 11 కోట్ల మంది రైతులకు, 2.60 లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తోందని, 10వేల FPOలను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.