Veena Vani Inter First Class :  తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ –వాణిలు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. వీణ 712 మార్కులు ,  వాణి 707 మార్కులు సాధించారు. వీరు ఇతరుల సాయం తీసుకోకుండానే పరీక్షలు రాశారు. సహజంగా పరీక్షలు రాయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయకులను పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తారు. వీణా, వాణిలకు అలాంటి అవకాశం ఉన్నా వారు వద్దని చెప్పేశారు.   ఏగ్జామ్స్‌ రాసేందుకు ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డ్‌ ప్రత్యేక సౌకర్యాలు కల్పించినప్పటికి వాటిని ఈ ఇద్దరు కవలలు  తిరస్కరించారు.  ఇంటర్‌ ఎగ్జామ్స్‌ స్వయంగా రాశారు.  


ప్రత్యేక ఏర్పాటు అవకాశాన్ని తిరస్కరించి స్వయంగా పరీక్షలు రాసిన వీణా - వాణి
 


వీణా - వాణి తమ పరిస్థితి అలా ఉందని ఏ మాత్రం నిరాశ చెందడం లేదు. భవిష్యత్‌పై ఎంతో ధీమాగా ఉన్నారు. తమ భవిష్యత్ లక్ష్యాలను కూడా స్పష్టంగా ఎంచుకున్నారు. భవిష్యత్తులో చార్టెడ్ అకౌంటెంట్స్‌ కావాలన్న తమ గోల్‌ని రీచ్ అవుతామని చెబుతున్నారు వీణా-వాణి. ముందు నుంచి వారి లక్ష్యంపై స్పష్టత ఉండటంతో ఇంటర్‌లో సీఈసీ గ్రూపే ఎంచుకున్నారు.  తమకు ఎలాంటి రిజిర్వేషన్ అవసరం లేదని కేవలం మెరిట్‌తోనే ఉత్తీర్ణత సాధిస్తామంటున్నారు.  ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి అయిన వెంటనే  ఫౌండేషన్ కోర్సులో చేరి చార్టర్డ్ అకౌంటెంట్‌ కోసం ప్రివేర్ అవుతున్నారు. మంచి మార్కులు సాధించడంతో  వారు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారని నమ్మకం ఏర్పడింది.


చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని లక్ష్యం 


ఫస్ట్ క్లాస్‌లో పాసయిన వీణా వాణిలను రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  వారిని అభినందించారు. వీణ –వాణి లు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు. భవిష్యత్తులో వారికి అవసరమై అన్నిసదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.   వీణ –వాణి లకు సహకారం అందించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.


సహకారం అందిస్తున్న ప్రభుత్వం 


మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతలకు 2003లో వీణా - వాణి జన్మించారు. తలలు అతుక్కొని పుట్టిన ఇద్దరు కవలను తల్లిదండ్రులు చూసుకోలేకపోయారు. చాలా సార్లు వారికి ఆపరేషన్ చేయించాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తల్లిదండ్రులకు దూరంగా  12సంవత్సరాల వరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో గడిపారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్‌ హోమ్‌లో గడుపుతున్నారు. తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధు, మిత్రులను వదిలి ఉంటున్న ఈ సిస్టర్స్‌  మనసులో ఒంటరి అనే భావన తెచ్చుకోకుండా చదువులో ముందంజ వేస్తున్నారు.