TSRTC MD Sajjanar: హైదరాబాద్: తమ సిబ్బంది బాగోగులపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ దృష్టి సారించారు. ఇటీవల ఆర్టీసీ సిబ్బందిపై వరుస దాడులు జరగడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పలు ఘటనల్లో పదే పదే స్పష్టం చేశారు. ప్రజల కోసం సేవ చేస్తున్న టీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై దాడి (Attack on TSRTC staff) ఘటనలో బాధ్యులకు జైలుశిక్షతో జరిమానా విధిస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.


ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం చర్యలు 
నిబద్దత, అంకితభావంతో పని చేస్తున్న TSRTC సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం అన్నారు. తమ సిబ్బందిపై కొందరు అకతాయిలు, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదని సజ్జనార్ స్పష్టం చేశారు. టీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై దాడి ఘటనలో బాధ్యులను గుర్తిస్తే.. వారిపై ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇందుకోసం పోలీస్ శాఖ సహకారం తీసుకుంటాం అన్నారు.




నిందితులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని వార్నింగ్ 
దాడులకు పాల్పడుతున్న వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని హెచ్చరించారు. దాడులు జరిగిన సమయంలో జరిగే బస్సు డ్యామేజీ ఖర్చులను సైతం నిందితుల నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. కనుక ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేసి ఇబ్బందులకు గురికావొద్దు అని ప్రజలకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఎంతో నిబద్ధతతో పనిచేసే ఆర్టీసీ సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించాలని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ఉత్తమమని కీలక సూచనలు చేశారు.