డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మందుబాబులు.. చేసే పనులు మామూలు ఉండదు. పోలీసులకే పరీక్ష పెడతారు. అయితే ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తునే ఉంటాం. ఇవన్నీ.. మామూలే.. అయితే తాజాగా ఓ ఇద్దరు మందుబాబులు ఏం చేశారో తెలుసా.. బ్రీత్ అనలైజర్ మెషిన్ ని పోలీసుల చేతిలోనుంచి లాక్కొని పారిపోయారు.
కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారావు నేతృత్వంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. సరిగ్గా 11.45 సమయంలో మియాపూర్ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులను బైకుపై వచ్చారు. వారిని పోలీసులు ఆపారు. అందరిలాగానే.. టెస్ట్ కు సహకరిస్తారని.. అనుకున్నారు పోలీసులు.. కానీ జరిగింది వేరే. హోంగార్డు బ్రీత్ అనలైజర్ టెస్టు చేస్తుండగా.. ఓ మందు బాబు నోటికి దగ్గరగా పెట్టిన బ్రీత్ ఎనలైజర్‌ను లాక్కొని క్షణాల్లోనే మాయమయ్యాడు. పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆ మందు బాబు అస్సలు దొరకలేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మాదాపూర్ పోలీసులు ఆకతాయిలను పట్టుకునే పనిలో పడ్డారు.
చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు బతిమిలాడించుకుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఊదమంటే ఊదకుండా సతాయిస్తుంటారు. బ్రీత్ ఎనలైజర్‌ను దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత కొందరు పైకి.. మరికొందరు కిందికి.. ఇంకొందరు ఉఫ్ ఉఫ్ అంటూ గాల్లోకి ఊదుతారు. సరైన రీడింగ్ రాదు. 15 సెకన్లు క్రమంగా ఊదితేనే మెషీన్ రీడింగ్ తీసుకుంటుంది. లేదంటే పదే పదే బీఏసీ కౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక డ్రంక్ అండ్ డ్రైవర్‌కు బీఏసీ చేయాలంటే కనీసం 20 నిమిషాలు సమయం తీసుకుంటుండగా తనిఖీలు అర్ధరాత్రి వరకు సాగుతుంటాయి.
ఇంకొందరు మందుబాబులు వాహనాన్ని అడ్డుపెట్టి తనను పోలీసులు వేధిస్తున్నారని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేస్తుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలంటే ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందే. అయితే మెుదటిసారిగా కొండాపూర్ లో మాత్రం.. ఎలాంటి హంగామా చేయకుండా.. ఇద్దరు వ్యక్తులు బ్రీత్ ఎనలైజర్ ఎత్తుకెళ్లడం చూసి పోలీసులు షాక్ అవుతున్నారు.
Also Read: 12 ఏళ్లుగా రోజుకు అరగంటే నిద్ర.. ఏ రోగం లేకుండా భలే బతికేస్తున్నాడు, అదెలా సాధ్యం?