Twist in Rooster Auction in Karimnagar: కరీంనగర్ (Karimnagar) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో 3 రోజుల క్రితం దొరికిన ఓ పందెం కోడిని శుక్రవారం వేలం వేసేందుకు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు (Nellore) జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఆ కోడి తనదే అంటూ వేలం ఆపాలని ఆర్టీసీ అధికారులను కోరాడు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. డిపో అధికారులను సంప్రదిస్తే కోడిని ఇవ్వడం కుదరదని చెప్పినట్లు తెలిపాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని.. వేలం ప్రక్రియ ఆపాలని విజ్ఞప్తి చేశాడు.


'ఆ కోడి నాదే'


నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్.. బతుకుదెరువు కోసం రుద్రంగికి వచ్చినట్లు చెప్పాడు. అక్కడ తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని.. రుద్రంగి నుంచి కరీంనగర్ మీదుగా నెల్లూరు వెళ్లే క్రమంలో కోడి పుంజు మర్చిపోయానని తెలిపాడు. ఈ క్రమంలో కోడిని వేలం వేస్తున్నట్లు తెలుసుకుని దాన్ని ఆపాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అతను తన ఇంట్లో, పెరట్లో కోడి తిరుగుతున్న వీడియోలను సైతం పంపించాడు. అంతే కాకుండా ప్రయాణ సమయంలో తాను కోడికి టికెట్ కూడా తీసుకున్నట్లు చెప్పాడు. తన ఆవేదనను ఓ సెల్ఫీ వీడియో రూపంలో విడుదల చేశాడు. పందెం కోడి వేలాన్ని ఆపాలని డిపో - 2 మేనేజర్ ను సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వాపోయాడు. 'ఆ కోడి నీదే అనే గ్యారెంటీ ఏంటి.? కోడిని నీకు ఇచ్చేది లేదు. ఇన్ని రోజుల నుంచి లేనిది శుక్రవారం మధ్యాహ్నం వేలం వేస్తామంటేనే నీ కోడి గుర్తొచ్చిందా.? కావాలంటే నువ్వూ వేలంలో పాల్గొనవచ్చు.' అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపైా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నాడు.


అయితే, ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే, 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం నిర్వహించాల్సి ఉంటుందని డిపో - 2 మేనేజర్ తెలిపారు. పందెం కోడి కోసం ఎవరూ రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనవచ్చని సూచించారు. వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని అన్నారు. అయితే, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సడన్ గా కోడి యజమాని ఎంట్రీ ఇచ్చారు. ఆ కోడి నాదే వేలంపాట ఆపాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కోడి వేలంపై ఉత్కంఠ నెలకొంది.


Also Read: Sankranti Special: సంక్రాంతి రద్దీలో ఇరుక్కోకుండా రైల్వే టిెకెట్స్ పొందడానికి ఈ ఆప్షన్లు కూడా ఉన్నాయి