Attack on Women Journalists: నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి, వెల్దండ గ్రామాల్లో మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డిపై దాడి ఘటనలో డీజీపీకి ఫిర్యాదు అందింది. జర్నలిస్టుల నుంచి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసు స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడికి యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ ను కలిసి టీయూడబ్ల్యూజే ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రుణమాఫీపై గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళా జర్నలిస్టుల పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని డీజీపీకి వివరించారు.


 ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డీజీపీని కోరారు. ఈ అంశంపై స్పందించిన డీజీపీ జితేందర్ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. డీజీపీని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రమణ కుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు సభ్యుడు అవ్వారి భాస్కర్, మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డి, పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు ఉన్నారు.


అసలేం జరిగిందంటే..


నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామంలో ఆవుల సరిత, ఎం విజయా రెడ్డి అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు సీఎం రేవంత్‌ రెడ్డి అనుచరులు కొట్టి, దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. వారిని బురదలోకి నెట్టారని ఆరోపిస్తున్నారు. స్థానిక విలేకరులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో వివాదాస్పద అంశంగా ఉన్న వ్యవసాయ రుణమాఫీ స్థితిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు మహిళా జర్నలిస్టులు వెళ్లారు.


రేవంత్ రెడ్డి పరిపాలనపై విమర్శనాత్మకంగా వీరు కవరేజీ చేస్తుండగా సీఎం అనుచరులు లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. వారు మహిళలపై భౌతికంగా దాడి చేశారు. కెమెరామెన్‌ల నుంచి కెమెరాలను లాక్కొని డిజిటల్ స్టోరేజీ కార్డులను లాక్కున్నారు. జర్నలిస్టు ప్రతినిధుల బృందాన్ని అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. చాలా సేపటి తర్వాత ఎట్టకేలకు మహిళా జర్నలిస్టులు వెళ్లిపోతుండగా.. వారి వాహనాలను వెంబడించారు. చివరికి వెల్దండి పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయం పొందారు.