Telangana Farmers Demands Urea | హైదరాబాద్: యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచిన క్రమంలో రెండు రోజుల్లో 18 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సచివాలయంలో ఎరువుల సరఫరా మరియు భారీ వర్షాల ప్రభావంపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని తెలిపారు.
రాష్ట్రానికి మరో 21 వేల టన్నుల యూరియావచ్చే వారం రోజుల్లో మరో 21 వేల టన్నుల యూరియా వచ్చే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ నెలలో అదనంగా ఎరువుల సరఫరా కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యవసాయశాఖ సమీక్షలో, వ్యవసాయ శాఖకు చెందిన విభాగాల నుంచే కాకుండా, కార్పొరేషన్‌ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది ఆలస్యంగా హాజరుకావడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో శుక్రవారం నుంచి ఎవరైనా ఆలస్యంగా వస్తే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
వర్షాలు, వరదల నష్టంపై నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశాలుహైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాలపై తక్షణమే ప్రాథమిక నివేదికను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్సులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు రాహుల్ బొజ్జ, రఘునందన్ రావు, శ్రీధర్, పోలీస్ శాఖ డీజీపీ, అదనపు డీజీ మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాల కారణంగా నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కువగా నష్టం సంభవించిందని, ఇతర జిల్లాలు కూడా అధికంగా ప్రభావితమయ్యాయని సీఎస్ తెలిపారు.
నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికలకు తోడు, వీడియోలు, ఫోటోలు, పత్రిక కథనాలను కూడా జతపరచాలని సీఎస్ రామకృష్ణారావు సూచించారు. సంబంధిత శాఖల కార్యదర్శులు , జిల్లాల కలెక్టర్లు పంపిన నివేదికలను విపత్తుల నిర్వహణ శాఖ సమన్వయం చేసి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రోడ్లు, చెరువులు, విద్యుత్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. వాటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని రామకృష్ణారావు ఆదేశించారు. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
వర్షాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం అందించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిపై పూర్తిస్థాయిలో సమీక్షించనున్నందున, సంబంధిత శాఖలు తీసుకున్న చర్యల వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎస్ రామకృష్ణారావు వారికి స్పష్టం చేశారు.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో నేడు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలన్నారు. వరద తగ్గడంతో పలుచోట్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.