The Untold Story of Barbarik Mahabharat : మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వచ్చిన ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా టైటిట్ గా పెట్టిన త్రిబాణధారి బర్బరికుడు ఎవరు? మహాభారతంలో తన క్యారెక్టర్ ఏంటి?
మహాభారతంలో పాత్రల గురించి చెప్పుకుంటే ఒకటా రెండా వందల పాత్రలు..ప్రతి క్యారెక్టర్ కి ఓ ప్రత్యేకత. ఇలాంటి వందల పాత్రల్లో ఒకడు బర్బరీకుడు. భీముడి మనవడు, ఘటోత్కచుని కుమారుడే బర్బరీకుడు. తల్లి పేరు మౌర్వి. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభ కనబర్చేవాడు. అస్త్రశస్త్రాల మీదున్న పట్టుచూసి దేవతలు ముచ్చటపడి మూడు బాణాలు అందించారు. ఆ 3 బాణాలతో ముల్లోకాల్లోనూ తిరుగులేదనే వరాన్నిచ్చారు.
ఓ పక్క బర్బరీకుడు పెరుగుతుండగా..కురుక్షేత్రం సంగ్రామం ఆరంభమైంది. భరతఖండంలో ఉన్న వీరులంతా ఎవరో ఒకరివైపు నిల్చోవాల్సిన తరుణం వచ్చింది. అలాంటి సమయంలో బర్బరీకుడు కూడా సంగ్రామానికి బయలుదేరాడు. తనయుడి బలం తెలిసిన తల్లి మౌర్వి.. ఏ పక్షం బలహీనంగా ఉందో వారికి నీ సహాయాన్ని అందించమని చెబుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కానీ యుద్ధం మొదలయ్యాక లెక్కలు మారిపోతాయ్. అప్పుడు బర్బరీకుడు కౌరవుల పక్షాన నిలవాల్సి రావొచ్చు. అంతటి యోధుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఉంటే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీ కృష్ణుడు. అందుకే బర్బరీకుడిని వారించేందుకు సిద్ధమవుతాడు.
బ్రాహ్మణుడి రూపంలో బర్బరీకుడికి ఎదురుపడి...మూడు బాణాలు తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావ్ అని ఎగతాళిగా అడుగుతాడు శ్రీ కృష్ణుడు. యుద్ధాన్ని ముగించడానికి ఈ మూడు బాణాలే చాలంటాడు.
మొదటి బాణం ఎవర్ని శిక్షించాలో గుర్తిస్తుంది.. రెండో బాణం ఎవర్ని రక్షించాలో గుర్తిస్తుంది..మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది యుద్ధాన్ని నిమిషంలో ముగించేందుకు ఈ 3 బాణాలు చాలని బదులిస్తాడు బర్బరీకుడు.
నీ మాటలు నమ్మేలా లేవన్న కృష్ణుడు.. ఈ చెట్టుపై ఉన్న రావి ఆకులు గుర్తిస్తూ తొలిబాణం ప్రయోగించు అంటాడు.. ఆ బాణం చెట్టుమీద ఆకులపై తన గుర్తు వేసి.. ఆ తర్వాత కృష్ణుడి కాలిచుట్టూ తిరగడం మొదలుపెడుతుంది. మీ కాలి కింద ఓ ఆకు ఉన్నట్టుంది మీ పాదాన్ని పక్కకు తీయండి అని చెప్పాడు బర్బరీకుడు. శ్రీ కృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఆకు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోతాడు. ఇంత ప్రతిభ ఉన్న బర్బరీకుడు యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అని ఆలోచిస్తాడు. పొరపాటున పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే..పాండవులు తప్పించుకోలేరని గ్రహిస్తాడు. బర్బరీకా! నువ్వు బలహీనుల పక్షాన పోరాడితే నువ్వు సహాయం చేసిన పక్షం వెంటనే బలమైనది అయిపోతుంది. అప్పుడు యుద్ధ భూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు అంటాడు.
వచ్చినవాడు బ్రాహ్మణుడు కాదు శ్రీ కృష్ణుడు అని గ్రహించిన బర్బరీకుడు నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. మహా భారత యుద్ధం ప్రారంభానికి ముందు ఓ వీరుడి తల కావాలని చెబుతాడు. తనను బలి ఇచ్చుకునేందుకు సిద్ధపడతాడు బర్బరీకుడు. అయితే తనకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలనే కోరిక ఉందని ఆ భాగ్యం కల్పించాలని కోరుతాడు. అలా మహావీరుడైన బర్బరీకుడి తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.
ఇలా చేయడం అన్యాయం కదా అని అనిపించవచ్చు.. కానీ శ్రీ కృష్ణుడు ఆ కోరిక కోరడం వెనుక మరో కథనం ప్రచారంలో ఉంది.
బర్బరీకుడు గడిచిన జన్మలో శాపగ్రస్తుడైన యక్షుడు..శాప విమోచనం కలిగించేందుకే తన తలను కోరాననీ వివరిస్తాడు కృష్ణుడు. కలియుగంలో బర్బరీకుడిని పూజిస్తారని..తన పేరు తల్చుకుంటేనే భక్తుల కష్టాలు చిటికెలో తొలగిపోతాయని వరమిస్తాడు కృష్ణుడు.
మరో కథనం ప్రకారం..
బర్బరీకుడి బాణం శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం వల్ల...మిగిలిన శరీర భాగాల కన్నా పాదం బలహీనపడిందని... ద్వాపరయుగాంతం సమయంలో అందుకే ఆ కాలికే బాణం గుర్చుకుందని చెబుతారు.
గమనిక: పురాణ గ్రంధాల్లో పేర్కొన్న వివరాలు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం