Tirumala Temple | తిరుమల: కలియుగదైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుతిస్తున్నారు. నేడు మొదటిరోజు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు అనుమతించగా.. భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్స్ పై టీటీడీ తొలిరోజు 550 నుండి 600 మంది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారుు.
తెలంగాణ భక్తులకు సిఫార్సు లేఖల ద్వారా శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రజాప్రతినిధులకు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ధన్యవాదాలు తెలిపారు. దర్శనం, మంచి వసతి కల్పిస్తున్న టీటీడీ అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విడుదల చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 294 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు అయ్యేవి. సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులను శ్రీవారి బ్రేక్ దర్శనాలకు అనుమతించేవారు. కానీ 2014లో రాష్ట్ర విభజన తరువాత టీటీడీలో మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట తెలంగాణ నేతల సిఫార్సులు చెల్లుబాటు అయ్యేవి. ఆ తరువాత క్రమంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనాలు నిలిపివేయడం దుమారం రేపింది. తిరుమలలో తెలంగాణ నేతలకు అవమానాలు అంటూ ఎంపీ రఘునందన్ రావు, మంత్రులు కొండా సురేఖ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఆరోపించారు.
ఆలయాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కొన్ని రోజుల కిందట సైతం తెలంగాణ నేతలు కోరారు. మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు అవుతాయని, వారిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవల తెలిపారు. దాని ప్రకారం సోమవారం నుంచి తిరుమలలో తెలంగాణ నేతల సిఫార్సు లేఖల్ని అనుమతించి, భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.