దసరా వచ్చిందంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ పండుగలకు కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో జరుపుకోవాలని అందరూ భావిస్తారు. హైదరాబాద్‌తోపాటు మిగిలిన నగరాల్లో స్థిరపడ్డవాళ్లు కూడా బతుకమ్మ పండుగ కోసం తెలంగాణలోని స్వగ్రామాలకు చేరుకుంటారు. పండుగల వేళ రద్దీ ఎక్కువ కావడం వల్ల ఉన్న బస్సులు, ట్రైన్లు సరిపోవు. అందుకే టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పండుగల కోసం సంతోషంగా స్వగ్రామాలకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 13 నుంచి 24 వరకు 5,265 స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంలో... ఆర్టీసీ ఉద్యోగులతోపాటు పోలీస్, రవాణాశాఖల సహకారం కూడా ఎంతో ఉందన్నారు సజ్జనార్. పండుగల వేళ ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి పోలీసు, రవాణాశాఖ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఈసారి కూడా ఆ శాఖలు సహకారం అవసరమని చెప్పారు సజ్జనార్. ఈనెల 13 నుంచి 24 వరకు 5,265 స్పెషల్ బస్సులు సిద్ధం చేసినా...
ఈనెల 20 నుంచి 23 వరకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని... దీంతో ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
గత ఏడాది దసరాకు 4వేల 280 ప్రత్యేక బస్సులను నడిపింది టీఎస్‌ఆర్‌టీసీ. ఈ ఏడాది మాత్రం మరో వెయ్యి బస్సులు అదనంగా నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే రద్దీ ఎక్కువగా ఉండటంతో.. గత ఏడాది కంటే ఈసారి ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచింది. టీఎస్‌ఆర్టీసీ సిద్ధం చేసిన 5,265 స్పెషల్ బస్సుల్లో... 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని ఇదివరకే ప్రకటించారు. ఈనెల 24న దసరా పండుగ కాగా... 22 సద్దుల బతుకమ్మ, 23న మహర్ణవమి. దసరా నవరాత్రుల్లో ఇవి ముఖ్యమైన పండుగలు. ఆ రోజుల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి... ప్రత్యేక బస్సులు పెంచుతామని చెప్పారు సజ్జనారు.
తెలంగాణతోపాటు పక్కరాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కూడా దసరా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అంతేకాదు... హైదరాబాద్‌లోని MGBS, జేబీఎస్, సీబీఎస్ బస్టాండ్లతోపాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే KPHB కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. పండుగ రోజుల్లో MGBS-ఉప్పల్, MGBS-JBS, MGBS-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటు ఉంచబోతున్నారు.
ప్రయాణికులు తమ సమయం వృథా కాకుండా... గమ్యం ట్రాకింగ్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు సజ్జన్నార్. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని కోరారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నట్టు చెప్పారు సజ్జనార్. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని... ప్రయాణికులకు ఆ సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను కూడా నియమిస్తున్నామన్నారు.