సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా.. మొదటి సారిగా మిగతా రూట్లలో కూడా ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే 1860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన సంస్థ.. వాటిలో కొన్నింటిని డిసెంబర్ లో వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే హరియాణా పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణాన్ని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. 


వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన తనిఖీ చేశారు. టీఎస్ఆర్టీసీకి అందిస్తోన్న రెండు ప్రొటో(నమూనా) బస్సులను పరిశీలించారు. జేబీఎం గ్రూప్ హెడ్ సేల్స్(నార్త్) ముఖేశ్ శర్మ, జీఎం ఆపరేషన్స్ ప్రశాంత్ శర్మతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ  బస్సుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి టీఎస్ఆర్టీసీకి అందించాలని వారిని ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. 


“జేబీఎం గ్రూప్ 500 ఎలక్ట్రిక్ బస్సులను ఒప్పందం ప్రకారం టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. వాటిని విడతల వారీగా ఆ కంపెనీ అందించనుంది. డిసెంబర్ లో కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యాధునిక హంగులతో ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తీసుకువస్తుంది.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. 


ఈ బస్సుల్లో ప్రయాణికులను లెక్కించే సదుపాయంతో పాటు భద్రతకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుందని, గమ్యస్థానాల వివరాల కోసం బస్సులో ఎల్ఈడీ బోర్డులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, సికింద్రాబాద్ డిప్యూటీ ఆర్ఎం భీమ్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్(ప్రాజెక్ట్స్) భాను ప్రసాద్, జేబీఎం గ్రూప్ ప్రతినిధులు నిఖిల్ ఓజా, అమిత్ వర్మ, మనోహర్ లాల్, తదితరులు పాల్గొన్నారు.