TSRTC MD Sajjanar : డీజిల్ సెస్, సెఫ్టీ సెస్ తో ప్రయాణికులు నడ్డి విరుస్తున్న టీఎస్ఆర్టీసీ మరోసారి ఛార్జీలు పెంచేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ మళ్లీ ఛార్జీలు పెరుగుతాయని చెబుతోంది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా ఈ ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీజిల్ రేట్లు పెరగడంతో ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ.2, ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, ఎయిర్ కండిషన్ బస్సుల్లో అదనంగా రూ. 5 వసూలు చేయనున్నట్లు తెలిపారు. డీజిల్ ధరలు ఇలానే పెరిగితే మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని సజ్జనార్‌ అన్నారు. త్వరలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త బస్సులో కోసం కొన్ని బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కొన్ని బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. 


పెరిగిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి 


టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను పెంచింది. ఈ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డీజిల్ ధర పెంపు కారణంగా ఆర్టీసీ డీజిల్ సెస్ విధించింది. పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ బస్సుల్లో టికెట్‌పై రూ. 2 చొప్పున అదనంగా సెస్ వసూలు చేస్తారు. ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, ఎయిర్ కండిషన్ బస్సుల్లో అదనంగా రూ. 5 వసూలు చేస్తున్నారు. డీజిల్ బల్క్ గా కొనుగోలు చేస్తే రూ. 118కు చేరిందని, ఒక్కో లీటర్‌పై రూ. 35 చొప్పున పెరగడం సంస్థపై భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు పెరుగుతుండడంతో డీజిల్ సెస్ తప్పడం లేదన్నారు. 


పెరిగిన బస్ పాస్ ఛార్జీలు


ఇటీవల అన్ని రకాల బస్‌ పాస్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పెంచింది. పెంచిన ధరలను ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్డినరీ పాస్‌ ఛార్జీని రూ.950 నుంచి రూ.1150కి పెంచింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కు పెంచింది. మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌జీవో బస్‌పాస్‌లకు ఆర్డినరీ పాస్‌ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు పెంచింది. ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.