Drought Allowance to TSRTC employees:


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. మరో విడత కరువు భత్యం(DA) ఇవ్వాలని TSRTC నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నట్లు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడించారు. 


పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. 


ఆ 2 రూట్లలో బస్సు సర్వీసులు..


హైదరాబాద్ లోని ప్రయాణికులకు బస్సు సర్వీసులపై TSRTC అప్ డేట్ ఇచ్చింది. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ మార్గంలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం కావడంతో ఆ రూట్లో వెళ్లే బస్సులను TSRTC పునరుద్ధరించింది. 113 నెంబర్ బస్సులు గతంలో లాగానే ఆ రూట్ లో యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సికింద్రాబాద్- మణికొండ మార్గంలో కొత్తగా బస్సులను నడపాలని నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. 5 K/M నెంబర్ గల ఈ బస్సులు మెహిదీపట్నం మీదుగా మణికొండకు వెళ్తాయి. ఈ సదుపాయాలను వినియోగించుకుని ప్రయాణికుల క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. 


రాఖీకి ఆర్టీసీ కొత్త రికార్డులు..
రాఖీ పౌర్ణమి నాడు TSRTC సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ నాడు రూ.21.66 కోట్లు సమకూరగా.. ఈసారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమికీ 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి. గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసీ బస్సులు తిరిగాయి. 2022లో రాఖీ పండగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయి.


20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్..
ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) లో ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును రిపీట్ చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈ సారి 104.68 శాతం రికార్డు OR నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయని సంస్థ తెలిపింది. నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ప్రయాణించారని సంస్థ తెలిపింది.