ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల విషయంలో ముందస్తు రిజర్వేషన్లు చేసుకుంటే విధించే ఛార్జీలను తగ్గించనుంది. ఇప్పటికి ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ బస్సు సర్వీసుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ ఛార్జీల‌ను వసూలు చేస్తున్నారు. ఆ ఛార్జీలు ఇకపై తగ్గనున్నాయి. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలో మీట‌ర్ల లోపు రూ.20, 350 పైబడి కిలో మీటర్లు ఉంటే రూ.30 అదనపు ఛార్జీని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నున్నారు.


‘‘సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు  ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ను టీఎస్ఆర్టీసీ స‌వ‌రించింది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయ‌మున్న ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ స‌ర్వీసుల్లో చార్జీల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలో మీట‌ర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీట‌ర్ల‌కు రూ.30గా చార్జీని నిర్ణ‌యించింది. సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ సర్వీసుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే రూ.30 వ‌సూలు చేయ‌నుంది. 


టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌కు మంచి స్పంద‌న ఉంది. ప్ర‌తి రోజు స‌గ‌టున 15 వేల వ‌ర‌కు త‌మ టికెట్ల‌ను ప్ర‌యాణికులు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ను త‌గ్గించ‌డం జ‌రిగింది. ఈ స‌దుపాయాన్ని ప్ర‌యాణికులంద‌రూ ఉప‌యోగించుకుని.. సంస్థ‌ను ఆద‌రించాలి." అని టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ కోరారు.