TSPSC Paper Leak: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలతో సహా తొమ్మిది మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిని శని, ఆది వారాల్లో సిట్ విడివిడిగా ప్రశ్నించగా... వాంగ్మూలాలను సరిపోల్చుతూ మొత్తం 30 ప్రశ్నలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసింది. దీని ఆధారంగా సోమవారం నుంచి నిందితులను ఉమ్మడిగా ప్రశ్నించాలని నిర్ణయించింది. ప్రవీణ్-రాజశేఖర్, ప్రవీణ్-రేణుక, రాజశేఖర్-రేణుక.. ఇలా ఇద్దరిద్దరు చొప్పున, ఆ తర్వాత అందరినీ కలిసి ప్రశ్నించడానికి సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు టీఎస్పీఎస్సీ నుంచి సీజ్ చేసిన కంప్యూటర్ వంటి వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక అందిన తర్వాత కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 


కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 పరీక్షలో డిస్ క్వాలిఫై కావడం వెనుక కుట్ర ఉందని సిట్ అనుమానిస్తోంది. ప్రవీణ్ ఆ పేపర్ కూడా చేజిక్కించుకున్నాడని, దాని ఆధారంగానే పరీక్ష రాసి 150కి 103 మార్కులు సాధించాడని తెలుస్తోంది. ఈ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రాకుండా ఉండడానికి ఓఎంఆర్ షీట్ ను తప్పుగా నింపి డిస్ క్వాలిఫై అయ్యాడా అనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది. అలా చేస్తే ఎవరి దృష్టిలోనూ పడమని, తనకు ఎలాగూ ఎక్కువ మార్కులు రావడంతో ఆ తర్వాత అదును చూసుకొని మెయిన్స్ పరీక్ష లోపు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ఆ పరీక్ష రాయడానికి అనుమతి పొందాలనే పథకం వేశాడాని భావిస్తున్నారు. మెయిన్స్ పేపర్ ను కూడా చేజిక్కించుకునేందుకు ప్రవీణ్ పథకం వేశాడని అనుమానిస్తున్నారు. అలాగే తనతో సన్నిహితంగా ఉన్న రేణుకతో ప్రవీణ్ ఈ వ్యవహారం గురించి చెప్పి ఉంటాడని, ఈ క్రమంలోనే ఆమె మిగిలిన ప్రశ్నపత్రాల లీకేజ్ ఆలోచన చేసి ఉంటుందని ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి జరిగే విచారణలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. 


జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డిది సాధారణ కుటుంబం. అత్తింటివారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అయితే రాజశేఖర్ రెడ్డి ఎదగడానికి రాజకీయ పరిచయాలే కారణం అని, విదేశాల్లో ఉండి రావడంతో హైదరాబాద్ ఎన్ఆర్ఐ సర్కిల్స్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ నాయకుడి పైరవీతో రాజశేఖర్ రెడ్డికి టీఎస్పీఎస్సీలో కొలువు దక్కిందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో 2018లో విదేశాల నుంచి తన స్నేహితులను రప్పించి మరీ ఆయన పరీక్షలు రాయించినట్లు అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు వారు దసరా కోసం మాత్రమే వచ్చారని రాజశేఖర్ బంధువులు చెబుతున్నారు. ఈ వ్యవహారం తేలాలంటే ఇలా ఎందరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్-1 రాశారో సిట్ పరిశీలించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 


ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ లో మంచి మార్కులు సాధించిన వారిని సిట్ అనుమానితిలుగా చేర్చింది. ప్రాథమికంగా 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 28 మందితో జాబితా రూపొందించారు. వీరి కాల్ డీటెయిల్స్, వాట్సాప్ వివరాల్లో.. నిందితుల లింకుల కోసం సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. గ్రూప్-1 పేపర్ ప్రవీణ్ లేదా మరెవరి ద్వారా అయినా వారికి అందిందా అనే అంశంపై దృష్టి పెట్టారు. ఇందులో కొందరిని ఇప్పటికే విచారించారు. కొందరు యూపీఎస్సీతో పాటు ఇతర పరీక్షలు కూడా రాసి మంచి మార్కులు పొందినట్లు గుర్తించారు. ముఖ్యంగా గ్రూప్ - 1 పేపర్ ను కూడా చాలా మందికి సర్క్యలేట్ చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే కమిషన్ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ వినియోగించిన కంప్యూటర్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. పేపర్లు అందుకున్న వారిని నిందితుల జాబితాలో చేర్చి ప్రశ్నించడానికి సన్నాహాలు చేస్తున్నారు.