TS Police Events : పోలీస్ ఉద్యోగాల రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన గర్భిణీలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పోలీస్ బోర్డు. గర్భిణీలకు ఈవెంట్స్ నుంచి మినహాయింపు ఇస్తూ పోలీస్ రీక్యూట్ మెంట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్ అర్హత సాధించిన కొందరు గర్భిణీలు ఈవెంట్స్ హాజరు కాలేకపోతున్నారు. గర్భిణీలకు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించింది బోర్డు. మెయిన్స్ పాసైతే నెల రోజుల్లోపు ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనాలని ఆదేశించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 3వరకు ఈవెంట్స్
పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టులు డిసెంబరు 8న ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 12 మైదానాల్లో జనవరి 3 వరకు జరిగే ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవకతవకలు, తప్పులకు ఆస్కారం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. బయో మెట్రిక్, ప్రతి అభ్యర్థి చేతికి చిప్ తో కూడిన రిస్ట్ బ్యాండ్, డిజిటల్ చిప్ తో ఉన్న ఆర్ఎఫ్ఐడీ జాకెట్ ను అటాచ్ చేస్తున్నారు. వీటి ద్వారా ఈవెంట్స్ పారదర్శకంగా జరిగేలా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఎంపిక చేసిన మైదానాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో మైదానంలో సగటున 130 మంది సిబ్బంది ఈవెంట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈవెంట్లు జరుగుతున్నాయి. అభ్యర్థులు రిక్రూట్మెంట్ బోర్డు కేటాయించిన తేదీలలో హాజరు కావాలని, తమతో పాటు అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లెటర్, డాక్యుమెంట్స్, పార్ట్–2 అప్లికేషన్ నుంచి సంబంధిత సర్టిఫికెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను తీసుకురావాలని అధికారులు సూచించారు.
ఈవెంట్స్ లో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు అనుమతి
ముందుగా అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులకు టోకెన్ నెంబర్ ఇచ్చి ప్రాంగణంలోకి అనుమతిస్తారు. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. బయోమెట్రిక్ తర్వాత రిస్ట్ బ్యాండ్, ఆర్ఎఫ్ఐడీ జాకెట్స్ అటాచ్ చేసుకున్న పురుష అభ్యర్థులకు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో రన్నింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పరుగుపందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో నిర్ణీత ఎత్తు ఉన్న వారికి మాత్రమే లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు. వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. బందోబస్తు కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లలో డీసీపీలు, ఏసీపీలు, మంది సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డ్ ఆఫీసర్లు- బందోబస్తు డ్యూటీలో పాల్గొంటున్నారు.