హైదరాబాద్: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్  జరిగిందని కేటీఆరే ఒప్పుకున్నారని మీడియాతో చిట్‌చాట్ లో భాగంగా చెప్పారు. ఇద్దరు, ముగ్గురి ట్యాపింగ్‌పై వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేసు నిరూపణ అయితే మాజీ మంత్రి కేటీఆర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. సినిమా వాళ్ల ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేశారని ప్రచారం జరిగిందన్నారు. కేసీఆర్ వద్ద ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లు.. హైదరాబాద్ రాజ్యాన్ని పట్టి పీడించిన కాశీం రజ్వీ కంటే గొప్పవాళ్లు అంటూ కోమటిరెడ్డి అన్నారు.
సినిమా థియేటర్లపై దాడులు..
తెలంగాణలో త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్ జరుగుతాయని సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొన్ని సినిమా హాల్లో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. తమ డిపార్ట్మెంట్ సిబ్బంది సినిమా హళ్లపై నిఘా ఉంచినట్లు చెప్పారు. ఎక్కడైనా రూల్స్ పాటించలేదని గమనిస్తే థియేటర్లను సీజ్ చేస్తామన్నారు. సినిమా ప్రమోషన్లకు, క్లాపింగ్‌లకు తాను రానని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారికీ మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసి టికెట్ రేట్లు పెంచాలి అని అడిగితే కష్టమన్నారు. భారీ బడ్జెట్ సినిమాల కారణంగా చిన్న సినిమాలతో పాటు ఆ సినిమాను నమ్ముకున్న వాళ్లకు నష్టం జరుగుతోందన్నారు. ఇప్పటివరకూ సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఎలాంటి ఫిర్యాదులూ రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, దర్యాప్తు చేపడతామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.


ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడం అంశంపై కూడా మంత్రి కోమటి రెడ్డి స్పందించారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీలో ఎంపీగా పోటీ అంటే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో కొత్త వాళ్లకు టికెట్ ఇవ్వడం అంటే గెలిచే వాళ్లకు ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదని, అందరికీ మేలు జరుగుతుందన్నారు. కానీ, హైదరాబాద్ లాంటి స్థానాల్లో గెలిచే అవకాశం అధికంగా ఉన్న వారికే టికెట్లు ఇవ్వడం జరిగిందన్నారు.