TS Assembly KCR : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని కేటీఆర్ ఇటీవల తరచూ ప్రకటిస్తూ వస్తున్నారు. టైగర్ వస్తుందని ఇక కాంగ్రెస్ పని ఖతమేనని కూడా చెప్పారు. అయితే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు కానీ అసెంబ్లీకి  హాజరు కాలేదు. గవర్నర్ ప్రసంగానికి హాజరు కాలేదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపై చర్చకూ హాజరు కాలేదు. గతంలో కేటీఆర్ చేసిన ప్రకటలను గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. 
 

  
 సీఎం రేవంత్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్ష నేత హోదాలో ఉండి బీఏసీ సమావేశానికీ వెళ్లలేదు.  తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడం అసెంబ్లీని అవమానించడమేనన్న విమర్శలను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశానికి వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి ఎందుకు రాలేదని అధికార పక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.                                       


బీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్లినప్పుడు సహకరించిన ఆరోగ్యం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడానికి సహకరించదా..? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.  నిజానికి బీఏసీ సమావేశానికి కేసీఆర్, కడియం శ్రీహరి హాజరవుతారని ఆ పార్టీ నేతలు పేర్లు ఇచ్చారు. దీంతో ఆయన హాజరవుతారని అనుకున్నారు. కానీ  సమావేశానికి మాత్రం ఆయన స్థానంలో హరీశ్ రావు వెళ్లారు. నిబంధనల ప్రకారం ముందు పేర్లిచ్చిన వారే రావాలని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమివ్వగానే ఆయన వెనుదిరిగారు. కావాలనే కేసీఆర్ బదులు హరీశ్ ను పంపారని విమర్శలు వస్తున్నాయి.                  


మరోవైపు ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో కేటాయించిన చాంబర్ పై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హోదాను బట్టి నిబంధనల ప్రకారమే చాంబర్ ను స్పీకర్ కేటాయిస్తారు. అదే ప్రకారం కేసీఆర్ కు కేటాయించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరైంది కాదని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చాంబర్ కేటాయింపును కూడా రాజకీయం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. . ప్రతిపక్ష నాయకుడి హోదాలో సభకు హాజరై ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇష్టారీతిలో వ్యవహరించడం సరికాదని  అధికార పక్ష నేతలు  ఆయన తీరును  తప్పు పడుతున్నారు.                


అయితే కేసీఆర్ సరైన సమయంలో సభకు వస్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశంపై చర్చ పెడితే కేసీఆర్ వచ్చి  బీఆర్ఎస్ తరపున ప్రభుత్వ తీరును ఎండగడతారని  చెబుతున్నారు.