TRS vs BJP Poaching Row: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగినట్లుగా భావిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ పై... వాడీ వేడి రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే యత్నం చేసి బీజేపీ అడ్జంగా దొరికిందని టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. కౌంటర్ గా బీజేపీ నాయకులు సైతం అంతే దూకుడుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఫిర్యాదు చేసేందుకు ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే మొయినాబాద్ ఫాంహౌజ్ హార్స్ ట్రేడింగ్ వ్యవహారం కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన ఈడీని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెర మీదకు వచ్చిన రూ. 100 కోట్లు.. ఎక్కడి నుండి వచ్చాయో నిజానిజాలు తేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన యత్నంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తమతోపాటు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్ లు ఉన్నారంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు మీడియాతో మాట్లాడిన వీడియోను బుధవారం ఆయన ట్యాగ్ చేశారు. ఆ "పార్టీ కొనుగోళ్లపై" తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నాలుగు జిల్లాల నుంచి ఇద్దరేసి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈ వీడియోలో రఘునందన్ రావు తెలిపారు. అలాగే కండువా కప్పుకొని పక్కన కూర్చోగానే టీఆర్ఎస్ నేతలు అనుకోవద్దని అన్నారు. తామే వాళ్లను టీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి పంపి ఉండవచ్చు కదా అంటూ కామెంట్లు చేశారు. అంతే కాదండోయ్ మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవలి కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నాయకులు పలువురు బీజేపీ బాట పట్టారు. మనుగోడు ఉపఎన్నిక తర్వాత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. బీజీపీ నేతలే ఈ రకమైన మైండ్‌గేమ్‌కు పాల్పడ్డారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు నాలుగు జిల్లాల నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మునుగోడు ఉపఎన్నికల తర్వాత తమ పార్టీలో చేరుతారని నేరుగానే చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఫలితం తేడా వస్తే.. ఆ పార్టీ నాయకుల్లో కూడా భవిష్యత్‌పై భయం ప్రారంభమవుతుంది. అదే సమయంలో అక్కడ బీజేపీ విజయం సాధిస్తే వలసల్ని ఆపడం టీఆర్ఎస్ హైకమాండ్‌కు కూడా సాధ్యం కాదు. రాజకీయం పూర్తిగా బీజేపీ వైపు ఉన్న సమయంలో.. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రయత్నిస్తే .. అడ్డుకునేంత సానుకూలత టీఆర్ఎస్ హైకమాండ్‌కు ఉండదు. ఈ విషయంలో బీజేపీ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ హైకమాండ్ ఏమీ చేయకుండానే ఎమ్మెల్యేలు ఆగిపోతారు.