తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ రోజు పండగ రోజు. మామూలు పండుగ కాదు. ఆషామాషీగా చేయడం లేదు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ.. అందరిలోనూ ఓ ఉత్సాహం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కారణం కేటీఆర్ పుట్టిన రోజు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. సాధారణంగా ముఖ్యమంత్రి పుట్టిన రోజుకు.. అదీ కూడా.. ఓ స్పెషల్ అకేషన్ ఉంటేనే ఈ స్థాయిలో చేస్తారు. కానీ టీఆర్ఎస్‌లో అలాంటి అకేషన్ లేదు... అయినా టీఆర్ఎస్ శ్రేణులు ధూం..ధాం చేస్తున్నాయి. దీనికి కారణం..  ఆ అకేషన్ ఈ ఏడాది వస్తుందనే అంచనాతో.   


త్వరలోనే కేటీఆర్ సీఎం అనే నమ్మకంలో టీఆర్ఎస్ క్యాడర్..!


కేటీఆర్ యువనేతగా.. ప్రభుత్వాన్ని పరోక్షంగా నడిపిస్తున్న నేతగా.. ఆయన ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సూపర్ పవర్‌ఫుల్‌గా కేటీఆర్ అంటే... అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉండటంలో ప్రత్యేకత లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలకు... ఆయన ఆల్ ఇన్ వన్. అయితే.. పుట్టిన రోజు ప్రతీసారి వస్తుంది. కానీ ఈసారి మాత్రం... ఎప్పుడూ కనిపించనంత సందడి కనిపిస్తోంది. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు... బ్యానర్లు.. సోషల్ మీడియాలో హడావుడితో పాటు.. నేతల పొగడ్తల ప్రకటనలు రెండు, మూడు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. రాజకీయాల్లో తలపండిపోయిన టీఆర్ఎస్ నేతలు... కేటీఆర్... యువనేతగా ప్రపంచానికి ఆదర్శంగా మారారని.. కీర్తించడం ప్రారంభించారు. టీఆర్ఎస్‌లో చిన్నా.. పెద్దా తేడా లేదు.. అందరూ..  కేటీఆర్‌ను... తమదైన భాషలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఈ హడావుడి వెనుక.. చాలా స్పష్టంగా కనిపిస్తోంది.. పట్టాభిషేక సందడేనని.. చాలా మంది గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇటీవల పరిణామాలు చూస్తే... కేటీఆర్‌కు త్వరలోనే.. సీఎంగా ప్రమోషన్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
 
ఎప్పటి నుంచో వినిపిస్తున్న నినాదం 


కేటీఆర్ సీఎం అనే నినాదం ఇప్పటిది కాదు. చాలా రోజులుగా సాగుతోంది.  కాకపోతే ఇటీవల మరీ ఎక్కువైంది. కొద్ది రోజుల క్రితంం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంత మంది మార్చిలోపు కేసీఆర్ సీఎంగా దిగిపోతారని.. కేటీఆర్‌ను పట్టాభిషిక్తుడ్ని చేస్తారన్న ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ కేసీఆర్ వాటికి ముగింపునిచ్చారు. అయితే  కేసీఆర్ మాత్రం.. ముఖ్యమంత్రి బాధ్యతలను తన కుమారుడికి అప్పగించాలన్న పట్టుదలతో ఉన్నారని టీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. జాతీయ రాజకీయాలపై ఆయనకు చాలా కాలంగా దృష్టి ఉంది. సరైన వేదిక కోసం చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలతో కలిసి వెళ్లడం కన్నా సొంత వేదిక పెట్టాలనే ఆలోచన ఇప్పటి వరకూ చేశారు. తర్వాత రాజకీయ పరిస్థితులు కలసి రాకపోవడంతో సైలెంటయ్యారు. మొత్తంగా టీఆర్ఎస్ నేతలకు మాత్రం..  కేటీఆర్ పట్టాభిషేక కళ ఈ పుట్టిన రోజులో కనిపిస్తోంది.