TRS To BRS :  టీఆర్ఎస్  పార్లమెంటరీ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి  పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్, లోక్‌సభ స్పీకర్‌  ఓం బిర్లాలకు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం  ఆమోదం తెలిపింది. ఈ మేరకు పేరు మార్చాలని కేసీఆర్ పంపిన లేఖను టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ  చైర్మన్ లకు అందజేశారు. బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ వెంటనే స్పందించారు. పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్‌గా మార్చాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. లోక్‌సభ స్పీకర్ సైతం టీఆర్ఎస్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని ఎంపీలకు చెప్పారు. శనివారం నుంచి  పార్లమెంట్‌లో అధికారికంగా బీఆర్ఎస్ ఎంపీలం అవుతామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతల కే.కేశవరావుప్రకటించారు.  


టీఆర్ఎస్ శాసనసభాపక్షం కూడా  బీఆర్ఎస్ఎల్పీగా మార్పు


గురువారమే  టీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని భారత్ రాష్ట్ర సమితి శాసనసభాపక్షంగా మార్చారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ విడుదల చేశారు. ఇక నుంచి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీగా టీఆర్ఎస్ ఎల్పీ మార్పు చెందినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీగా కార్యకలాపాలు నిర్వహించనున్నారు. పార్టీ పేరు మారిన క్రమంలో శాసనసభ, మండలి రికార్డుల్లోనూ పేరు మార్చాలని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత.. కౌన్సిల్ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. పార్టీ పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆ విజ్ఞప్తికి అనుగుణంగా టీఆర్ఎస్ శాసనసభా పక్షం పేరును బీఆర్ఎస్ శాసనసభా పక్షంగా మారుస్తూ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.


క్రిస్మస్ తర్వాత ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్ లు 
 
 భారత రాష్ట్ర సమితికి సంబందించిన కిసాన్ సెల్ కార్యకలాపాలను ముందుగా ఆరు రాష్ట్రాల్లో ప్రారంభించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.   ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ అధికారిక ఆవిర్భావం నాడు హైద్రాబాద్లో  ప్రకటించిన అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందస్తుగా 6  రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. 


కిసాన్ సెల్ బాధ్యతలు చేపట్టేందుకు ఆరు రాష్ట్రాల నుంచి రైతు నాయకుల అంగీకారం !


ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన  పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీం లతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కేసీఆర్ తో సంప్రదింపులు జరిపుతున్నారని టీఆర్ెస్ వర్గాలు చెబుతున్నాయి.    ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక సాంస్కృతిక   పరిస్థితులను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాలో వారికి కేసీఆర్ వివరిస్తున్నారు.  ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు.