TRS MLAs Poaching Case: మోయినాబాద్ ఫాం హౌస్ కేసులో నిందితులైన రామ చంద్ర భారతి, నంద కుమార్ ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కేసులో చంచల్ గూడ జైలు నుంచి వారు బయటకు వచ్చేలోపు ఇతర కేసులతో మళ్లీ అరెస్ట్ చేశారు. నెలన్నర కాలంగా జైల్లో ఉన్న వీరిద్దరినీ విడుదల అయిన వెంటనే అరెస్ట్ చేశారు. కారాగారం నుంచి తమ వస్తువులతో సహా బయటకు రాగా.. అప్పటికే పోలీసులు గేటు వద్ద కాపు కాశారు. నిందితులు ఇద్దరూ గేటు దాటిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఇద్దరినీ ఎక్కించారు. విచారణ ఖైదీలుగా చంచల్ గూడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయటంతో పూచీకత్తు సమర్పణ అనంతరం నిన్న సింహయాజీ బయటకు వచ్చారు.
వేర్వేరు పేర్లు, చిరునామాలతో రెండు పాస్ పోర్టులు..
ప్రధాన నిందితులు అయిన రామచంద్ర భారతి, నంద కుమార్ లు ఈరోజు ఉదయం విడుదల అయ్యారు. కానీ ఇద్దరి పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వేర్వేరు కేసులు ఉండగా... నంద కుమార్ పై ఇతర స్టేషన్ లలోనూ కేసులు ఉన్నాయి. రామచంద్ర భారతి వేరు వేరు పేర్లు, చిరునామాలతో రెండు పాస్ పోర్టులు కల్గి ఉన్నాడని రాజేంద్రనగర్ ఏసీపీ బంజారాహిల్స్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందకుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే 5 ఛీటింగ్ కేసులు నమోదు అయ్యాయి. జూబ్లీహిల్స్ పీఎశ్ లో ఫోర్జరీ కేసు నమోదు అయింది. రాజేంద్ర నగర్ ఠాణాలో నందకుమార్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.
గత నెల 24వ తేదీన మెదక్ జిల్లా గజవాడకు చెందిన బాలయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు మోదు చేశారు. రూ.80 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్న బాలయ్య.. డబ్బులు అడిగితే ఇవ్వకుండా కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నందకుమార్ పై రాజేంద్ర నగర్ పీఎస్ లోనే 2017లో నమోదైన మరో ఛీటింగ్ కేసు ఉండగా... అమీర్ పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లోనూ 2018లో మరో కేసు నమోదు అయింది. దీంతో నందకుమార్ పై పీడీ యాక్టు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. ఈ కేసుల్లో ఇద్దరినీ విచారించేందుకు కారాగారం నుంచి బయటకొచ్చిన కాసేపటికే పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
కేసు ఏంటి, ఏం జరిగింది?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం నెల రోజులుగా తెలంగాణలో సంచలం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 100 కోట్ల ఇస్తామని రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ ఆశ చూపారు. ముందు పైలెట్ రోహిత్ రెడ్డి కలిసిన ఈ నేతలు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఫామ్ హౌస్ వీడియోలు, ఆడియోలను టీఆర్ఎస్ బయటపెట్టింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్ ను తిరస్కరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎఫ్ఐఆర్‌లో ఇలా
నిందితులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన బేరసారాలను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పూసగుచ్చినట్టు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, నందకిశోర్, సింహయాజీపై కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. బీజేపీలో చేరితో వంద కోట్లు... చేర్చిన వాళ్లకు యాభై కోట్ల పేరుతో ఆఫర్ నడిచించదని పోలీసులు చెబుతున్నారు. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇప్పిస్తామని రోహిత్ రెడ్డికి రామచంద్ర భారతి ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు. దీనికి నంద కిశోర్ మధ్యవర్తిత్వం వహించారు. నంద కిశోర్ ఆహ్వానంతోనే రామచంద్రభారతి, సింహయాజీ ఫామ్‌హస్‌కు వచ్చారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన వారు ఎమ్మెల్యేలతో బేరాలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వచ్చిన మధ్యవర్తులు జరగబోయే పరిణామాలు వివరించారని పేర్కొన్నారు పోలీసులు. బీజేపీలో చేరకపోతే...కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పినట్టు కూడా అందులో తెలిపారు. బీజేపీలో చేరితే కీలక కాంట్రాక్ట్స్‌తోపాటు భారీ మొత్తంలో డబ్బు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామన్నట్టు వివరించారు. ఇదంతా రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.