TRS MLAs Buying Case: తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫాం హౌస్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఫాం హౌస్ లో తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసు పూర్వాపారాలను పరిశీలిస్తున్నారు. ఇందులోకి ఇతరులను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఈ స్థలంలో ఎక్కడైనా డబ్బులు దాచారా అన్న కోణంలోనే సోదాలను ముమ్మరం చేశారు. తమకు అనుమానంగా కనిపించిన ప్రతీ చోటును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు నిందితులను రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారణ చేస్తున్నారు.
ఈ నలుగురి బేరసారాల వెనుక ఎవరున్నారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీరి దగ్గర ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. అలాగే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో హాజరుపరచనున్నారు. సెల్ ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులపై ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రివెన్సన్ ఆఫ్ కరెప్సన్ యాక్ట్ 8లోని సెక్షన్ 120బీ కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఎఫ్ఐఆర్ లో మొయినాబాద్ పోలీసులు ఏం రాశారంటే..?
నిందితులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన బేరసారాలను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పూసగుచ్చినట్టు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, నందకిశోర్, సింహయాజీపై కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు.
బీజేపీలో చేరితో వంద కోట్లు... చేర్చిన వాళ్లకు యాభై కోట్ల పేరుతో ఆఫర్ నడిచించదని పోలీసులు చెబుతున్నారు. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇప్పిస్తామని రోహిత్ రెడ్డికి రామచంద్ర భారతి ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు. దీనికి నంద కిశోర్ మధ్యవర్తిత్వం వహించారు. నంద కిశోర్ ఆహ్వానంతోనే రామచంద్రభారతి, సింహయాజీ ఫామ్‌హస్‌కు వచ్చారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన వారు ఎమ్మెల్యేలతో బేరాలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
వచ్చిన మధ్యవర్తులు జరగబోయే పరిణామాలు వివరించారని పేర్కొన్నారు పోలీసులు. బీజేపీలో చేరకపోతే...కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పినట్టు కూడా అందులో తెలిపారు. బీజేపీలో చేరితే కీలక కాంట్రాక్ట్స్‌తోపాటు భారీ మొత్తంలో డబ్బు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామన్నట్టు వివరించారు. ఇదంతా రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.
మధ్యవర్తులకేం సమస్య లేదు.. ఎమ్మెల్యేలకే!
అయితే ఈ ఎపిసోడ్‌లో మధ్యవర్తులు..బేరసారాలు ఆడేవారు ప్రముఖులు కాదు. ఈ విషయంలో వారు దొరికిపోయినా.. వెంటనే బయటకు రాగలరు. కానీ ఫామ్ హౌస్‌లో కనిపించిన నలుగురు ఎమ్మెల్యేలపై మరక మాత్రం పడిపోతుంది. బీరం హర్షవర్థన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు ఇలా ఫామ్‌హౌస్‌లో చర్చలు జరుపుతూ దొరికిపోయారు. వారిపై మరక ఖచ్చితంగా పడుతుంది. ఈ బేరసారాల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికే తాము వచ్చామని వారు తర్వాత వారు వాదించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పోలీసులు రెయిడింగ్ జరిగినప్పుడు వారు అంత కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. తమను ప్రలోభ పెట్టడానికి వచ్చారని.. తామే పోలీసుల్ని పిలిపించామని వారు చెప్పలేదు.