Putta Madhu :  పార్టీ మార్పు ప్రచారం పై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్పందించారు. తాను సొంత పనుల కోసం మాత్రమే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీలు మారుతున్నా అని... కొందరు తన పై ప్రచారం చేయడం బాధాకరంగా ఉందని అన్నారు. తాను కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని అని.. కేసీఆర్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని పుట్టామధు తెలిపారు. జిల్లా పరిషత్ కోసం పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.  మంథనిలో తనకు పోటీ లేదని.. తాను భారీ మెజార్టీతో గెలవుతున్నానని పుట్టా మధు అన్నారు. తనకు వేరే పార్టీ మారే అవసరం లేదని చెప్పారు. పార్టీలో తనకు గుర్తింపు ఉందన్న ఆయన.. తన పేరు చెప్పి పంచాయతీలకు కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. అసలు ఢిల్లీ రావాలంటేనే భయం వేస్తోందన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీ వస్తే ప్రతిష్టను దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారని పుట్టా మధు ఆరోపించారు. 


పుట్ట మధును దూరం పెడుతున్న టీఆర్ఎస్ హైకమాండ్ 


అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఇటీవల సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఇతర నాయకులతో సమావేశం నిర్వహించారు. అయితే దీనికి పుట్ట మధుకు ఆహ్వానం అందలేదు  దాంతో అలిగిన ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని బీజేపీలో సంప్రదింపులు జరిపారని చెబుతున్నారు.  దీనికితోడు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై ఎప్పుడైనా ఈడీ రెయిడ్స్ జరగవచ్చనే అనుమానాలు ఉన్నాయి. టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితుడు. ఈ కారణంగానే ఆయన ఈటలతో కలిసి బీజేపీలోకి వెళ్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం జరిగిన లాయర్  వామన్‌రావు దంపతుల హత్య విషయంలోనూ పుట్ట మధుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ నిందితుడు.  


చీకోటి క్యాసినో వ్యవహారంలోనూ ప్రముఖంగా వినిపించిన పుట్ట మధు పేరు 


కొన్నాళ్లుగా పుట్ట మధును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరం పెడుతున్నారు. ఆయనను పార్టీ సమావేశాలకు పిలువడం లేదు. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో తనకు పార్టీలో భవిష్యత్ లేదని ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ కారణంగానే పార్టీ కి దూరమవుతారని చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు మారబోరని.. టిక్కెట్ రాదని కన్ఫర్మ్ అయిన  తర్వాతనే పార్టీ మారతారని అంటున్నారు. అయితే పుట్ట మధు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినా .. పార్టీ మారినా ఎవరూ పట్టించుకోరని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పుట్ట మధుపై అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. 


ఈటల రాజేందర్ సన్నిహితుడు పుట్ట మధు


చికోటి ప్రవీణ్ తో హవాలా వ్యవహారంలో పుట్ట మధు కీలక భాగస్వామిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం చీకోటి విషయంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో తన రాజకీయ గురువు ఈటల రాజేందర్ ఢిల్లీలోల మకాం వేసి ఉన్న సమయంలో అక్కడ ప్రత్యక్షం కావడం సహజంగానే చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం పుట్ట మధు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నారు.