తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన  సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాలు  విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా  మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్  పిలుపు నిచ్చింది.   ఈ నెల 6, 7, 8 తేదీలో " మహిళా బంధు  కెసీఆర్ " పేరిట సంబరాల చేయాలని పార్టీ క్యాడర్‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించారు. 


ఆరో తేదీన కేసిఆర్‌కు రాఖీ కట్టే కార్యక్రమం ఉంటుంది. అయితే అందరూ నేరుగా కట్టలేరు కాబట్టి ఫ్లెక్సీలకు రాఖీలు కట్టొచ్చు. అలాగే ఆ రోజున  పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం చేస్తారు. కెసిఆర్ కిట్, షాదీ ముబారక్,  థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏడో తేదీన  మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవాలని కార్యకర్తలకు టీఆర్ఎస్ దిశానిర్దేశం చేసింది. లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం కూడా అందులో భాగం. ఇక ఎనిమిదో  తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబురాలు నిర్వహిస్తారు.  


 
10 లక్షల మంది పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలోని తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ అని కేటీఆర్ ప్రకటించారు.  సుమారు 11 లక్షల మంది కెసిఆర్ కిట్ లబ్ధిదారుల మైలురాయిని చేరుకుందని.. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్నందున  ఈ సారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చింది.  ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేయాలన్న ప్రాథమిక లక్ష్యంతో దేశం ఎరుగని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కెసిఆర్  విజయవంతంగా పూర్తిచేశారని ... మాతా శిశు సంరక్షణ కోసం కెసిఆర్ కిట్టు పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని టీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. 


కల్యాణలక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది లబ్ధిదారులకు రూ. 9022 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెళ్లి కానుక అందజేసింది.   ఇతరులు బేటీ బచావో బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్‌దేనని కేటీఆర్ చెబుతున్నారు. అందుకే టీఆర్ఎస్ మూడు రోజుల పాటు సంబరాలు చేయాలని నిర్ణయించుకుంది