Ambulance: అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్‌లు(Ambulance) అడ్డదారులు తొక్కుతున్నాయి. పేషెంట్‌లు లేకున్నా  సైరన్‌(Siren) మోగిస్తూ అడ్డదిడ్డంగా ట్రాఫిక్‌లో దూసుకుపోతున్నాయి. జనాన్ని రవాణా చేస్తూ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు..


అడ్డదారులు తొక్కుతున్న అంబులెన్స్‌(Ambulance)లు
కుయ్‌..కుయ్‌మంటూ సైరన్‌ మోగించుకుంటూ రయ్‌రయ్‌నా దూసుకుపోయే అంబులెన్స్‌లు చూస్తే వాహనదారులు ఎవరైనా పక్కకు తప్పుకుని దారి ఇస్తారు. ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు మానవత్వం చాటుకుంటారు. అయితే  దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు(Drivers) రెచ్చిపోతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా సైరన్‌లు మోగించుకుంటూ స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద కూడా ఆగకుండా అడ్డదారుల్లో వెళ్లిపోతున్నారు. నిజంగా ఎవరికైన అత్యవసర పరిస్థితి ఉందేమో అనుకుంటే పొరబడినట్లే..తీరా వెళ్లి చూస్తే అందులో ఉండేది ప్రయాణికులు మాత్రమే. అంబులెన్స్‌ డ్రైవర్లు వాటిని షటిల్‌ ట్రిప్పులుగా ఉపయోగించడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. పైగా రోగులు ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాల్సిన సైరన్‌లు ఇష్టానుసారం వాడుతున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌(Traffic Signals) పడినప్పుడు అడ్డదారుల్లో దూసుకుపోతూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొందరు డ్రైవర్లు అంబులెన్స్‌ అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌వినియోగిస్తూ...లోపల ఎవరు ఉన్నారో కనిపించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. 


నిబంధనలు ఉల్లంఘన
అత్యవసర సమయాల్లో మాత్రమే సైరన్ వినియోగించాల్సి ఉన్నా....ఇష్టానుసారం అంబులెన్స్‌లు సైరన్‌లు వినియోగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం సైరన్ వేయాలంటే ముందుగా ఆ స్టేషన్ పరిధిలోని పోలీసులకు తెలియజేయాలి.అప్పుడు పోలీసులే గ్రీన్‌సిగ్నల్ ద్వారా ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. కానీ ఏ అంబులెన్స్ డ్రైవర్‌ ఈ నిబంధన పాటించడం లేదు. వాహనంలో ఆక్సిజన్‌(Oxygen) సిలిండర్‌తోపాటు నర్సు, అనుభవం ఉన్న వైద్యుడు(Doctor) ఉండాలి కానీ ఏ అంబులెన్స్‌లో ఇలాంటి సౌకర్యాలు మచ్చుకైనా కనిపించవు. లైసెన్స్‌ కలిగిన నిపుణుడైన డ్రైవర్‌ ఉండాలి. కానీ లైసెన్స్‌ లేని డ్రైవర్లు, పర్మిట్‌ లేని వాహనాలతో రోడ్డెక్కి ప్రజల ప్రాణాలతో చెలగాడటం అడుతున్నారు. అటు ప్రయాణికులు సైతం తొందరగా వెళ్లొచ్చన్న భావనతో అంబులెన్స్‌లు ఎక్కేందుుక మొగ్గు చూపుతున్నారు. టోల్‌గేట్లు వద్ద సైతం వీటిని అడ్డుకోవడం ఉండదు. ప్రత్యేక లైన్‌లో వేగంగా దూసుకుపోతాయి. అంబులెన్స్‌లను ఇప్పుడు ఎవరూ పేషంట్లుకు వినియోగించడం లేదు. ఎక్కువశాతం మృతదేహాలను తరలించేందుకే వినియోగిస్తున్నారు. అలాంటి సమయంలో సైరన్ వేయకూడదన్న నిబంధనలు ఉన్నా...అంబులెన్స్‌ డ్రైవర్లు సైరన్ మోగించుకుంటూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆస్పత్రులకు సంబంధించిన సేవలు మాత్రమే వినియోగించాల్సి ఉన్నా దీన్ని ట్యాక్సీలాగా వాడేస్తున్నారు.


పోలీసు కేసులు
ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్‌, మెదక్‌ మార్గాల్లో ఇలాంటి వాహనాలు ఎక్కువగా సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు నిఘాపెట్టారు. వారంరోజుల్లో 30కి పైగా నకిలీ అంబులెన్స్‌లు గుర్తించారు. వీటిల్లో కొన్నింటికి అసలు పర్మిట్‌ లేవు, డ్రైవర్లకు లైసెన్స్‌ లేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలు సీజ్‌ చేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సైరన్‌ మోగించుకుంటూ రాంగ్‌రూట్‌లో వెళ్తున్న కొందరు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు . మరోసారి నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రుల యాజమాన్యం సైతం అంబులెన్స్‌ డ్రైవర్ల కదలికలపై కన్నేసి ఉంచాలని హెచ్చరించారు. నిపుణులైన, నమ్మకమైన వారినే  డ్రైవర్లుగా నియమించుకోవాలని సూచించారు.