కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని తెలంగాణ పీసీసీ నేతలు కలిశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారు మర్యాదపూర్వకంగా రాహుల్‌ను కలిశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై రేవంత్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మోదీతో భేటీ కావడంపై మాట్లాడుతూ.. పార్టీలు వేరైనా ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు. 


ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఎంఐఎం ఎన్ని స్థానాలలో పోటీకి దింపాలనే విషయంపై కేసీఆర్-మోదీల మధ్య చర్చ జరిగిందని విమర్శించారు. కేసీఆర్, మోదీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ బలి పశువులు కాబోతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


ఈ సందర్భంగా సెప్టెంబ‌ర్ 17న సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గ‌జ్వేల్‌లో తలపెట్టిన ద‌ళిత, గిరిజ‌న దండోరా బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా రాహుల్‌ను కోరినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేకాక, ప్రతి 3 నెలలకోసారి తెలంగాణలో పర్యటించాలని రాహుల్ గాంధీని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని రేవంత్ అన్నారు. డిసెంబరు 9 నుండి రాష్ట్రంలో పార్టీ నిర్మాణం కోసం సభ్యత్వ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ సూచనలు, సలహాల మేరకు రాష్ట్రంలో పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఢిల్లీలో అమరవీరుల స్తూపం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరం స్థలం కేటాయించాలని డిమాంద్ చేశారు.


తొలిసారి రాహుల్‌తో భేటీ
తెలంగాణ టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత కొత్త టీంతో రాహుల్ గాంధీ తొలి సారి సమావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎల్పీ నేత భ‌ట్టివిక్రమార్క, పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు, మధుయాస్కి సహా కొత్తగా ఎన్నికైన వివిధ క‌మిటీల ఛైర్మన్లు కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా తెలంగాణ పీసీసీ నేతలు రాష్ట్ర ప్రస్తుత రాజకీయ ప‌రిస్థితులు, కేసీఆర్ పాల‌న‌, బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్న తీరును గురించి చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయమై రాహుల్ గాంధీ పార్టీ నేతలతో చర్చించినట్లు రేవంత్ రెడ్డి భేటీ అనంతరం తెలిపారు.