60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. మంథని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన, నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. TSPSC ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో విక్రయించారని ధ్వజమెత్తారు.
జోడో యాత్రతో ప్రజలకు అండ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజలకు అండగా నిలిచారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఇన్నేళ్లు ఎంపీ పదవుల్లో ఉన్నప్పటికీ ఆయనకు సొంత ఇళ్లు లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు.?. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని, నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకెళ్లారని గుర్తు చేశారు.
'సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారు'
సీఎం కేసీఆర్ మరోసారి మాయ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలను స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించింది ఎవరని, హైదరాబాద్ కు ఐటీ ప్రాజెక్టులు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది ఎవరు.? అని రేవంత్ నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ లకు వందల ఎకరాలు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ కు రేవంత్ కౌంటర్
కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమని, తెలంగాణకు నెంబర్ వన్ విలన్ హస్తం పార్టీ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఆరోపించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. 'నిస్సిగ్గు మాటలకు కేరాఫ్ అడ్రస్ కేటీఆర్. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్, బీజేపీతో అంటకాగింది. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన వర్శిటీ, బయ్యారం ఉక్కుకు పాతరేసింది మీరే.' అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు.
'తెలంగాణకు మీరు అవసరం లేదు'
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేని అసమర్థులని, అలాంటి వారి పాలన ఇక తెలంగాణకు అవసరం లేదని ట్విట్టర్ లో విమర్శించారు.
కేటీఆర్ ఏమన్నారంటే.?
తెలంగాణ మంత్రి కేటీఆర్ అంతకు ముందు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. 'తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్. ల్యాండ్ మాఫియాకు రేవంత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్. ఆయన ముక్కు నేలకు రాసినా రాష్ట్ర ప్రజలు హస్తం పార్టీని నమ్మరు. ' అని తెలిపారు. సంక్షేమంలో స్వర్ణ యుగానికి కేరాఫ్ తెలంగాణ అయితే, చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని దుయ్యబట్టారు. గత పదేళ్ల కాలంలో ట్రైబల్ వర్శిటీపై రాహుల్ ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.