నేటి నుంచి మూడు రోజులపాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు వ్యక్తిగత, సామూహిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, సీనియర్ నాయకులకు టీపీసీసీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమావేశాలలో పాల్గొనాలని నాయకులు కోరారు. రేపటి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
నేడు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం
నేడు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగనుంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై చర్చించి.. దాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పదంగా మారిన కామారెడ్డి మున్సిపల్ ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలంటూ రైతులు, స్థానికులు డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు రాజీనామాలు చేసి, రైతులకు మద్దతుగా నిలిచారు. అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా రాజీనామాలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు నేడు కామారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్థన్ ఇల్లు ముట్టడికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నేడు నిర్వహించాలని నిర్ణయించారు. రైతులతో పాటు స్థానిక ప్రజల నుంచి మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు రావడంతోనే మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారనే చర్చ సాగుతోంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కామారెడ్డి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ లో అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గోశామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ కు నోటీసులు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41A CRP కింద రాజాసింగ్ కు నోటీసులు పంపారు. గతేడాది ఆగస్టులో అజ్మీర్ దర్గాపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కంచన్ బాగ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు మంగళహాట్ పోలీస్స్టేషన్కు బదిలీ అయ్యింది. దీంతో ఈ కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు రాజాసింగ్కు తాజాగా నోటీసులు పంపారు. అంతకుముందు.. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో రాజాసింగ్ జైలు నుంచి విడుదల అయ్యారు.
డీజీపీ అంజనీ కుమార్ డీజీపీగా కొనసాగుతారా? నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ
తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న 12 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపు వివాదానికి సంబంధించిన పిటిషన్‌లపై నేడు తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అధికారుల కేటాయింపులను సవాలు చేస్తూ 11 మంది ఐఏఎస్‌లు, నలుగురు ఐపీఎస్‌లు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. మార్గదర్శకాలు సరిగ్గా లేవంటూ వాటిని రద్దు చేస్తూ 2016లో క్యాట్ తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ కేంద్రంతో పాటు, పలువురు అధికారులు 2017లో హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. వీరిలో ఇద్దరు ఐపీఎస్‌లు గత ఏడాది పిటిషన్‌లను వెనక్కి తీసుకున్నారు. గత వారం.. సోమేశ్‌కుమార్ కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులిస్తూ క్యాట్ తీర్పును రద్దు చేసింది. అధికారుల కేటాయింపు బాధ్యత కేంద్రానిదేనని, సోమేశ్ కుమార్‌ను ఏపీకి కేటాయించింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సబబేనని తీర్పు ఇచ్చింది. మిగిలిన అధికారులకు చెందిన వివాదంపై నేడు (జనవరి 20) ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వీటిలో ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌పై పిటిషన్ కూడా ఉంది.
నేటి నుంచి హోమియో సీట్ల భర్తీ
తెలంగాణలో ప్రైవేటు హోమియో మెడికల్ కాలేజీల్లో బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా కింద ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారిక వెబ్ సైట్ లో ఉంచినట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 20న ఉదయం 8 నుంచి 21న సాయంత్రం 6 గంటల వరకూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఆరోగ్య వర్సిటీ సూచించింది.