నేడూ కొనసాగనున్న ఈడీ విచారణ, విచారణకు ఎమ్మెల్సీ ఎల్. రమణ 


రాష్ట్రంలో కలకలం రేపిన క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే క్యాసినో నడుపుతున్న చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్ యాదవ్, దర్మేందర్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారించారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ ఎల్ రమణకు కూడా ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి క్యాసినో అడేవారిని వలవేసి, వారికి ప్రత్యేక ప్యాకేజీలు అందించి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా తీసుకువెళుతూ పెద్ద ఎత్తున డబ్బును తరలించారని పలువురు టూర్ ఆపరేటర్లతోపాటు, పలువురు ప్రముఖులపై గత జులైలో ఈడీ కేసు నమోదు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎల్ రమణ కి చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తో పాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి కూడా నేడు ఈడీ అధికారల ముందు హాజరుఅయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకు కేవలం నేతల బంధువులు, సన్నిహితులు,  బినామీలకే నోటీసులు రాగా ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్సీకి విచారణకు హాజరు కావాలని ఈడీ కోరడంతో పాటు సమయం కూడా తక్కువగా ఇవ్వడంతో ఏం జరుగుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకా జిల్లాకు చెందిన ఎవరి మెడకు చుట్టుకుంటుందో నని అందరూ చర్చించుకుంటున్నారు. 


నేడు రాష్ట్రంలో కేంద్రమంత్రులు పర్యటన
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ పరిశ్రమల కేంద్ర శాఖ మంత్రి  మహేంద్ర నాథ్ పాండే తో పాటు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు గనులు శాఖ మంత్రి ప్రహల్లాద జోషి భవనగిరి, మల్కాజ్ గిరి  నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి అందుతున్న విధానాన్ని ప్రజలను అడిగి తెలుసుకుంటారు. వారు సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను వివిధ ప్రాంతాలలో తిరిగి తెలుసుకుంటారు పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసి సమావేశం కానున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను, పేద బడుగు బలహీన వర్గాల కోసం కేంద్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారు వివరిస్తారు. మహేంద్ర నాథ్ పాండే 18వ తేదీకూడా నాగర్ కర్నూల్ లోనే పర్యటిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాలు గనులు శాఖ మంత్రి ప్రహల్లాద జోషి 18వ తేదీనీ మల్కాజ్ గిరి  పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తారు.


నేను పార్టీ మారడలేదు - మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తాను పార్టీ కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారనీ, అందులో నిజం లేదన్నారు. మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లడంతోపాటు, మరోవైపు ఢిల్లీలోనే కొంతమంది రాష్ట్రానికి చెందిన నేతలు అక్కడ ఉండటంతో ఊహాగానాలకు తెరలేచింది. అయితే తాను తన మనవడు స్కూల్ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చానని శశిధర్ రెడ్డి తెలిపారు. తాను ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్ లోనే బీజేపీ నేతలుకూడా రావడంతో ఇలాంటి వదంతలు వ్యాపించాయని శశిధర్ రెడ్డి చెప్పారు. ఢిల్లీకి తాను రావడం కొత్తేమి కాదని ఆయన పేర్కొన్నారు. తాను ఇంకా రాజకీయాలనుంచి రిటైర్ కాలేదని అన్నారు.