Top political updates Highlights in telangana 2022 : తెలంగాణకు ఎన్నికల ఏడాదిలా 2022 నడిచింది. అన్ని రాజకీయ పార్టీలు హైపర్ యాక్టివ్ అయ్యాయి.  రాజకీయంగా పైచేయి సాధించేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఓ మాటలో చెప్పుకోవాలంటే.. ఈ ఏడాది మొత్తం టీఆర్ఎస్ చుట్టూనే నడిచింది. చివరికి ఆ పార్టీ బీఆర్ఎస్‌గా మారింది. ఇదే హైలెట్.. దీని చుట్టూ ఎన్నో రాజకీయాలు ఏడాది మొత్తం నడిచాయి. 


బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ 


తెలంగాణ అంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్లుగా సాగిన ప్రస్థానం 2022తో ముగిసింది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. దసరా రోజు తీర్మానం చేశారు. డిసెంబర్ రెండో వారంలో ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసీఆర్ వెంటనే ఢిల్లీలో పార్టీ ఆఫీసును ప్రారంభించారు.   21 ఏళ్ల పాటు తెలంగాణతో పాటు దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలిసిన పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఇన్నాళ్లు తెలంగాణ కోసం కోట్లాడిన పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కనుమరుగై.. కేసీఆర్ చేసిన సంతకంతో బీఆర్ఎస్ ప్రస్థానం మొదలైనట్లయింది. ఇకపై దేశ రాజకీయాల్లో గులాబీ బాస్ సమర శంఖం పూరిస్తారని అంటున్నారు ఆపార్టీ నేతలు. ఇది కేవలం పార్టీ పేరు మార్పు కాదని, దేశ గతిని మార్చే ఓ శక్తి అని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ మోడల్ ను చూపిస్తూ.. భారత్ ను బాగు చేసుకుందామని అంటున్నారు కేసీఆర్. తెలంగాణ జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఇప్పుడే కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎంత మేర సంచలనం సృష్టిస్తుందో 2023 తేల్చనుంది. 
 
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు !


బీఆర్ఎస్ తర్వాత తెలంగాణలో బాగా హైలెట్ అయిన మరో ఘటన ఢిల్లీ లిక్కర్ స్కాం. స్కాం ఢిల్లీదే అయినా ఎక్కువగా వినిపించిన పేరు సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే. అయితే ఇప్పటి వరకూ ఆమెను అధికారికంగా నిందితురాలిగా తేల్చలేదు. సాక్షిగా వివరణ తీసుకున్నారు. సాక్ష్యాల కోసం మరో నోటీసు ఇచ్చారు. అయితే కేసు మాత్రం కవిత వద్దకే వస్తోందన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  కవితతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో లింక్స్ ఉన్న వాళ్లను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తుండటం, ఇంకా అవసరమైతే ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్రమక్రమంగా కవిత  చుట్టూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక పథకం ప్రకారమే ఉచ్చు బిగిస్తున్నారా అని బీఆర్ఎస్ వర్గాలూ నమ్ముతున్నాయి. ఈ కేసులో వచ్చే ఏడాది కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 


సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ కేసు!


అప్పట్లో రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు  కేసులో ట్రాప్ చేసి అరెస్ట్ చేసినట్లుగానే... మరో ఎపిసోడ్ ఈ ఏడాది జరగడం సంచలనం సృష్టించింది. అదే ఫామ్ హౌస్ కేసు. మెయినాబాద్‌ సమీపంలోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌజ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో మధ్యవర్తులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు చర్చలు జరిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఏయే విషయాలు చెప్పారనే దానిపై గతంలో రెండు ఆడియో టేపులు బయటకు రాగా.. నిన్న ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోలను మీడియా ముందు విడుదల చేశారు సీఎం కేసీఆర్ . వాటిని మీడియాతో పాటు అన్ని రాష్ట్రాల హైకో్ర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపుతున్నానని.. వాళ్లే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. ఈ కేసు విచారణలో భాగంగా బీజేపీ పెద్దల హస్తం ఉందని సిట్ గుర్తించింది. వచ్చే ఏడాది ఈ కేసు విషయంలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 


గవర్నర్ - ప్రభుత్వం మధ్య పెరిగిన దూరం !


ప్రభుత్వం- గవర్నర్ మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పులా ఉండటంతో ఈ ఏడాది అనేక వివాదాలు హైలెట్ అయ్యాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి కేసీఆర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. గవర్నర్‌కు తెలంగాణలో ఎలాంటి ప్రోటోకాల్ అందడం లేదు.  రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌కు మధ్య గ్యాప్‌  ఊహించనంతగా పెరిగింది. అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులు ఇంకా రాజ్ భవన్‌లోనే ఉన్నాయి. తమిళిసైపై అనేక రకాల ఆరోపణలను టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. 


తెలంగాణలో రాహుల్ రెండు వారాల పాదయాత్ర
 
భారత్ జోడో యాత్ర తెలంగాణలో రెండు వారాల పాటు సాగింది. రాహుల్ యాత్ర తెలంగాణలో విజయవంతంగానే సాగింది..ఆయన యాత్ర జరిగిన ప్రాంతాల్లో జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది.  యాత్రలో రాహుల్ ఆద్యంతం ప్రజలని దగ్గర చేసుకుంటూ ముందుకెళ్లారు.  అందరినీ హక్కున చేర్చుకున్నారు..అలాగే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా నడిచారు..డ్యాన్స్ వేశారు..పిల్లలతో ఆడుకున్నారు..ఏ వర్గం వాళ్ళతో ఆ విధంగా కలిసిపోయారు. ఇలా రాహుల్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. ఇక తాజాగా పాదయాత్ర తెలంగాణలో ముగిసి..మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. ఇక తెలంగాణలో పాదయాత్ర ముగింపు సందర్భంగా జుక్కల్‌లో భారీ సభ జరిగింది. ఈ సభ కూడా భారీ స్థాయిలోనే జరిగింది..ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పర్యటనతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. 


రాజకీయాన్ని మార్చేసిన మునుగోడు ఉపఎన్నిక


కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ సెమీ ఫైనల్స్‌గా భావించాయి. ఇక్కడ గెలిచే పార్టీకి ఫైనల్స్‌లో అడ్వాంటేజ్ ఉంటుందని నమ్మకంగా చెబుతూ వచ్చాయి. అందుకే శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. చివరికి టీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే.. ఓ రాజకీయం ఉండేది. అది మరింత ఉద్రిక్తంగా ఉండేదని.. టీఆర్ఎస్ గెలవడంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు అనే ముప్పు తప్పిందన్న వాదన వినిపిస్తోంది. 


షర్మిల పై దాడి కలకలం 


వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టుకుని చాలా కాలంగా పాదయాత్ర చేస్తున్నా షర్మిలకు రాని గుర్తింపు 2022లో కొన్ని ఘటన వరకూ వచ్చింది. వరంగల్ జిల్లాలో తన పాదయాత్రపై జరిగిన దాడి.. ఆ తర్వాత ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల ప్రయత్నించగా పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు.  అరెస్ట్ కావడంతో షర్మిల మైలేజ్ పెరిగిందని.. షర్మిలకు లేడీస్ సపోర్ట్ లభించినా ఆమె కెరీర్ కచ్చితంగా పుంజుకుంటుందని వైఎస్ఆర్ టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  షర్మిల తనదైన శైలిలో వ్యూహాలను సిద్ధం చేసుకుని ప్రజలకు దగ్గరయ్యారని.. అంటున్నారు. తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.. అయితే షర్మిల ఇందులో వాక్యూమ్ తెచ్చుకుని చోటు తెచ్చుకుంటారో లేదో..2023 తేల్చనుంది. 
 
రాజ్యాంగం మార్చాలన్న  కేసీఆర్ వ్యాఖ్యల కలకలం


" కొత్త రాజ్యాంగం కావాలి " అని కేసీఆర్ ఫిబ్రవరిలో చేసిన ప్రకటన చాలా రోజుల పాటు రాజకీయంగా చర్చనీయాంశం అయింది.  బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఇంత కాలం విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కాదు.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే విధానం తీసుకున్న కేసీఆర్ ఈ " రాజ్యాంగ మార్పు" వాదన తీసుకొచ్చారు.జ్యాంగ మార్చాలి అని కొత్త చర్చను కేసీఆర్ తీసుకొచ్చారు. దీనిపై డిబేట్ జరగాలి అన్నారు. దీని గురించి పదే పదే చెప్పి... మీడియాకు అది రాయాలి అని కూడా అన్నారు.  తర్వాత ఈ అంశంపై చర్చ సద్దుమణిగిపోయింది. కేసీఆర్ పై చాలా మంది విమర్శలు చేశారు. అయితే తర్వాత కేసీఆర్ కూడా రాజ్యాంగ మార్పు గురించి పెద్దగా ఎక్కడా స్పందించలేదు. 


అక్టోబర్‌లో తెలంగాణలోకి సీబీఐకి నో ఎంట్రీ 
 
తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టడం ఈ ఏడాది పొలిటికల్ హైలెట్స్‌లో ఒకటి.  సీబీఐకి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను  ఉపసంహరించుకుంది.   జీవో 51ను ఆగస్టు 30న జారీ చేసింది. కానీ ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ జీవో ప్రకారం ఎలాంటి నేరాల విషయంలోనైనా తెలంగా­ణలో దర్యాప్తు చేసేందుకు ప్రతి కేసుకు రాష్ట్ర ప్ర­భు­త్వం  నుంచి ముందస్తుగా సమ్మతి తీసు­కోవాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. అయితే సీబీఐ అధికారులు నేరుగా కవిత నివాసానికి వచ్చి విచారణ జరిపారు. గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి నోటీసులు కూడా ఇచ్చారు. ఇది కూడా  హాట్ టాపిక్ అయింది. 


కేంద్రంతో పోటీగా  ఇండిపెండెన్స్..తెలంగాణ ఆవిర్భావ వేడుకలు


కేంద్రం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను  ” అజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరుతో  నిర్వహించింది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం  కేంద్రంతో సంబంధం లేకుండా.. కొత్తగా “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ ” పేరుతో వేడుకలు నిర్వహించారు.  ద్విసప్తాహం నిర్వహణకు ప్రత్యేక చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. కేంద్రం ముద్ర లేకుండా నిర్వహించడం ట్రెండింగ్ అయింది. ఆ తర్వాత తెలంగాణ  విమోచనా దినాన్ని కూడా కేంద్రం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో.. తెలంగాణ ప్రభుత్వం వాటిని మరిపించేలా వైభవంగా జరిపింది. ఈ వ్యవహారాలు ట్రెండింగ్‌గా మారాయి.