Top Head Lines in Telugu States:
1. తెలంగాణలో మరో 2 గ్యారెంటీల అమలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారెంటీల అమలుకు మంగళవారం శ్రీకారం చుట్టింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించనుంది. తొలుత ఈ పథకాలను చేవెళ్ల బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వర్చువల్ గా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదల కావడం.. వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో వేదికను మారుస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలోనే వీటిని ప్రారంభించనున్నట్లు సమాచారం.
2. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు తెలిపాయి. రాహుల్ గాందీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని హస్తం వర్గాలు భావిస్తున్నాయి. అటు, ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ లోని అమేఠీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని పార్టీ ఉన్నత వర్గాలు తెలిపాయి.
3. తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష తేదీ వచ్చేసింది
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయానికి 4 గంటల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
4. నేడు వైసీపీ కీలక సమావేశం
మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ లో మంగళవారం (ఫిబ్రవరి 27న) వైఎస్ఆర్ సీపీ కీలక సమావేశం జరగనుంది. సమావేశం ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి వైసీపీ ఇంఛార్జి గంజి చిరంజీవి తదితరులు పర్యవేక్షించారు. ఇది ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం అని అన్నారు. క్షేత్రస్థాయి, మండల కార్యకర్తలతో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు ఇందులో పాల్గొంటారని తెలిపారు.
5. ఏపీలో నేడు కేంద్ర హోం మంత్రి పర్యటన
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం ఏపీలో పర్యటించనున్నారు. ఏలూరులో నిర్వహిస్తోన్న బీజేపీ ప్రజా పోరు యాత్ర ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార విధానంపై ఆయన రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం, రాజ్ నాథ్ విశాఖ, విజయవాడలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
6. 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు
8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని విచారణను ముగించారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పిటిషన్‌తో ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేశారు. టీడీపీ పిటిషన్‌తో మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌పై వేటు వేశారు.
7. APPSC గ్రూప్ - 2 ప్రిలిమ్స్ కీ విడుదల
ఏపీలో 'గ్రూప్ -2' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రశ్నపత్రంతోపాటు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు తెలియజేయవచ్చు. ఆన్‌లైన్‌లో మాత్రమే అభ్యంతరాలు సమర్పించాలని ఏపీపీఎస్సీ సూచించింది. పోస్టు/వాట్సప్/ఎస్‌ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
8. నేటి నుంచి ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటన
ప్రధాని మోదీ మంగళ, బుధ వారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించనున్నారు. విక్రమ్ సారాభాయ్- అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ క్రమంలో అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం మధురైలో జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు.
9. నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. యూపీ 10, కర్ణాటక 4, హిమాచల్ ప్రదేశ్ ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. 15 స్థానాల్లో హోరా హోరీగా పోటీ జరగనుంది. ఖాళీ స్థానాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
10. కొత్త జంటకి అయోధ్య రామ మందిరం నుంచి స్పెషల్ సర్ ప్రైజ్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానిని పెళ్లాడిన విషయం తెలిసిందే. సుమారు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 21న గోవాలో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా ఈ నూతన జంటకు తాజాగా అయోధ్య రామ మందిరం నుంచి ప్రసాదం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది.