Revant Reddy :  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీపీసీసీ   స్వీకరించనుంది.   దరఖాస్తులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  సీఏల్పీ నేత భట్టి విక్రమార్క గాంధీ భవన్‌లో విడుదల చేశారు.  ఎస్సీ, ఎస్టీ ధరఖాస్తుదారులకు రూ.25 వేలు, బీసీ, ఓసీలకు రూ. 50 వేల రూపాయల ధరఖాస్తు రుసుముగా ఖరారు చేసినట్లు తెలిపారు. దరఖాస్తు రుసుము నాన్ రిఫండబుల్ అని..  పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.  ఈ నెల 25 తర్వాత దరఖాస్తులను స్క్రూటీని చేస్తామన్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామన్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదిక ఇస్తామని చెప్పారు. చివరిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. మీడియాలో అభ్యర్థులు ఖరారు అని వచ్చే వార్తలు అవాస్తవమని అన్నారు. 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టిక్కెట్ అడిగితే పీఏసీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. 


కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు కొంటే పార్టీకి నిధుల సాయం చేసినట్లే !                              


కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా అధికారంలో లేకపోవడంతో పార్టీ నిర్వహణకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిధుల సమస్య ఏర్పడటంతో ...  వినూత్న మార్గాల ద్వారా పార్టీ నేతల నుంచే నిధులు సమీకరిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో టిక్కెట్ల కోసం దరఖాస్తులు చేసేవారి దగ్గర అప్లికేషన్ ఫీజులు వసూలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణలోనూ అదే పద్దతి పాటిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురు ఐదుగురు నేతలు పోటీ పడుతూంటారు. టిక్కెట్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేయడంతో అందరూ అప్లికేషన్లు  కొని.. దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వుడు కేటగరి సీట్లను మినహాయించినప్పటికీ.. పార్టీకి ఈ అప్లికేషన్ల ద్వారానే ఒకటి రెండు కోట్ల  వరకూ నిధులు లభిస్తాయన్న  అభిప్రాయం ఉంది.  





 


ఇప్పటికే తొలి జాబితా రెడీ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం                      



నిజానికి కాంగ్రెస్ లో అభ్యర్థుల కసరత్తు చాలా కాలంగా నడుస్తోంది. ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలన్న దానిపై పూర్తి స్థాయిలో ఓ నిర్ణయానికి వచ్చారని  చెబుతున్నారు. తొలి జాబితా సిద్ధమయిపోయిందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కేవలం ఫార్మాలిటీ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారని చెబుతున్నారు.  పలువురు నేతలకు టిక్కెట్లు హామీ ఇచ్చి ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. వారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  తొలి జాబితా ఖరారయిందనే ప్రచారం ఉత్తదేనని రేవంత రెడ్డి చెబుతున్నారు.               


సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే !  


కాంగ్గెస్ పార్టీ సీనియర్లు చాలా మంది తాము కూడా దరఖాస్తు చేసుకోవాలా అన్న మీమాంసలో ఉన్నారు. అయితే దరఖాస్తుకు వెల పెట్టింది.. టీ పీసీసీ కాదని.. హైకమాండేనని.. అందరూ డబ్బులు  పెట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. కొంత మంది సీనియర్లు తమ రేంజ్ ఏమిటి.. తము దరఖాస్తు చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే తనతో సహా ఎవరికీ మినహాయింపులు లేవని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.