Match Tickets : 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ టికెట్ల విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ప్రతీ రోజూ క్రికెట్ ఫ్యాన్స్ రావడం టిక్కెట్ల కోసం పడిగాపులు పడటం... వెళ్లడం జరుగుతోంది. కానీ ఫలానా తేదీన టిక్కెట్లు ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. దీంతో టిక్కెట్ల కోసం వచ్చిన వారు బుధవారం స్టేడియం వద్ద ఆందోళనకు దిగారు. టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ నగదును రిఫండ్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇంత గందరగోళం జరుగుతున్నా హెచ్‌సీఏ అధికారులు స్పందించడం లేదు.
ఇప్పటివరకు టికెట్స్ ఇష్యూ చేయకపోవడంతో హెచ్ సీయూ తీరుపై మండిపడుతున్నారు. టికెట్స్ ఎప్పుడిస్తారో క్లారిటీగా చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం రేపు ఇస్తారంటూ ఫ్యాన్స్ కు సర్ధిచెప్పి పంపిస్తున్నారు. వారం రోజులుగా టికెట్స్ కోసం ఫ్యాన్స్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మూడ్రోజుల కింద ఆన్ లైన్ లో పెట్టినా.. వెంటనే అయిపోయినట్లు చూపించారు. ఇక ఆఫ్ లైన్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ రోజూ గ్రౌండ్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ జింఖానా గ్రౌండ్ కు భారీగా చేరుకున్నారు. అక్కడ కూడా టికెట్స్ ఇవ్వట్లేదని తెలియడంతో అభిమానులు గొడవ చేశారు. ముందు జాగ్రత్తగా హెచ్‌సీఏ అధికారులు పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరింపచేశారు.
హెచ్ సీఏ బ్లాక్ లో టికెట్లకు ప్రోత్సహిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. టికెట్ ల కోసం ఉప్పల్ వెళితే జింఖానా గ్రౌండ్ కి వెళ్ళండి అని చెబుతున్నారు. జింఖానా గ్రౌండ్స్ కి వస్తే ఇక్కడ ఎవరు లేరు. ఇప్పటి వరకు ఆఫ్ లైన్ టికెట్స్ విషయంలో స్పష్టత ఇవ్వక పోవడం దారుణమని క్రికెట్ లవర్స్ మండి పడుతున్నారు. టికెట్స్ అన్ని బ్లాక్ లో విక్రయిస్తున్నారు. రూ.2 వేల టికెట్స్.. రూ. 5 వేలు, రూ.6వేలకు విక్రయిస్తున్నారు. టికెట్స్ అన్ని బ్లాక్ చేసుకొని సామాన్య ప్రజలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్ట్ లాయర్ సలీం, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. టికెట్లను కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రీడాభిమానులను మోసం చేసేలా హెచ్‌సీఏ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. మూడేండ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతున్నదన్నారు. టికెట్లను బ్లాక్‌లో అమ్ముతుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలని కోరారు. అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.