SIT Notices : ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ సిట్ మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గుస్వామి సోదరుడితో పాటు సిబ్బందికి నోటీసులిచ్చింది. జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌కు నోటీసులు జారీ చేసింది. జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సిట్.. ఈసారి కూడా హాజరుకాకపోతే 41-ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించింది.
నందకుమార్ భార్యతో పాటు ప్రతాప్ అనే లాయర్ విచారణ
ఇప్పటికే నందకుమార్ భార్యతో పాటు మరో లాయర్ ప్రతాప్‌కూ సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ప్రతాప్ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తునకు ప్రతాప్ సహకరించాలని ప్రతాప్‌ను అరెస్టు చేయరాదని సిట్‌ను హైకోర్టు ఆదేశిచింది. ఈ కేసులో సీవీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును నిందితుల జాబితాలో చేర్చింది. జగ్గుస్వామి, తుషార్ వెళ్లపల్లి, న్యాయవాది బీ శ్రీనివాస్‌ను కూడా నిందితులుగా సిట్ చేర్చింది. ఈ మేరకు సిట్ కేసులను విచారించే ఏసీబీ కోర్టుకు నివేదిస్తూ మెమో దాఖలు చేసింది.
జైల్లో ఉన్న నిందితుల్ని మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ఇప్పటికే అరెస్టయ్యారు. వీరు గత 25 రోజులుగా జైల్లో ఉన్నారు.ముగ్గురు నిందితులు మాట్లాడిన ఆడియో, వీడియోల్లో పలుమార్లు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ పేర్లు ప్రస్తావించినట్లు ఆధారాలు ఉన్నాయని సిట్ హైకోర్టు విచారణ సందర్భంగా చెప్పింది. అయితే ఈ ముగ్గుర్ని మరోసారి కస్టడీలోకి తీసుకోవాలనుకున్న సిట్ ప్రయత్నాలు ఫలించలేదు. ముగ్గురు నిందితులను సిట్ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నిరాకరించింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇచ్చినందున సిట్ అభ్యర్థనను ఆమోదించలేకపోతున్నట్టు ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్ తెలిపారు.
ముగ్గురు చెప్పిన సమాచారంతోనే సంతోష్‌ను నిందితునిగా చేర్చిన సిట్
జైల్లో ఉన్న ముగ్గురి నుంచి సేకరించిన సమాచారం మేరకు సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెల్లపల్లికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. కేరళలో సోదాల్లోనూ జగ్గుస్వామి, తుషార్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఇద్దరికి ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు సైతం జారీచేశారు. ఈ నెల 26 లేదా 28న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలని బీఎల్ సంతోష్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్‌తోపాటు శ్రీనివాస్‌ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడంతో ఈ కేసులో కీలక మలుపులు ఉండబోతున్నాయని చెబుతున్నారు.