TRS Vs  BJP : భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఆ పేరు లేకుండా భిన్నంగా నిర్వహిస్తున్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను 15 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక కమిటీని నియమించి..దానికి చైర్మన్‌గా కేశవరావును నియమించారు. 


స్వాతంత్య్ర వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించనున్న తెలంగాణ 


ఈ ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆగస్టు 8 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేశవరావు ప్రకటించారు.  వజ్రోత్సవాలను ఆగస్టు 8న హైటెక్స్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని చెప్పారు. ముగింపు ఉత్సవాలు 22న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో పోలీస్‌ బ్యాండ్‌, ఇతర కళారూపాల ప్రదర్శన ఉంటుందని అన్నారు. హైదరాబాద్‌ నగరం మొత్తం అలంకరిస్తామని, స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలను, హోర్డింగులను ప్రదర్శిస్తామని చెప్పారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న జాతీయ నేతల చరిత్రను తెలిపేలా 15 రోజుల పాటు ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. 


హర్ ఘర్ తిరంగా పేరు లేకుండా ప్రతి ఇంటిపై జాతీయ జెండా 


ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే కేంద్రం హర్ ఘర్‌కు అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న కోటి కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే తెలంగాణ హర్ ఘర్ తిరంగా పేరుతో ఇలా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని ప్రకటించింది. హర్ ఘర్ తిరంగా పేరు లేకుండా తెలంగాణ సర్కార్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 


ఎల్బీ స్టేడియంలో భారీగా ముగింపు కార్యక్రమం


దీపాంజలి కార్యక్రమం, అంబేద్కర్‌ విగ్రహం నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు భారీ జాతీయ జెండా ర్యాలీ, ట్రాఫిక్‌ సిగ్నళ్లలో జనగణమన ఆలాపన వంటివి కూడా నిర్వహిస్తారు.  ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ముగింపు ఉత్సవాలకు ప్రతి జిల్లా నుంచి వెయ్యి నుంచి 2 వేల మందిని తీసుకొచ్చి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తంగా కేంద్రం దేశభక్తి కాన్సెప్ట్‌తో నిర్వహిస్తున్న ఉత్సవాలను అంత కంటే ఘనంగా నిర్వహించి.. కేంద్రం కన్నా తమకే ఎక్కువ పేరు వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.   ఈ అంశంపై బీజేపీ విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది.