Political Attacks : ఏపీలో .. అది డీజీపీ ఆఫీసు పక్కనే ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీసు, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ప్లాన్డ్‌గా దూసుకొచ్చి విధ్వంసం సృష్టించి వెళ్లారు. దాడి చేసి వెళ్లేవాళ్లని పోలీసులు స్వయంగా సాగనంపారు. ఒక్క కేసు లేదు. ఎందుకంటే మా పార్టీ వాళ్లకు బీపీ వచ్చిందని స్వయంగా సీఎం జగన్ సమర్థించుకున్నారు... తెలంగాణలో హై సెక్యూరిటీ జోన్ అయిన బంజారాహిల్స్‌లో వీఐపీ అయిన నేత ఇంటిపై పదుల సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. విధ్వంసం సృష్టించారు. కానీ ఒక్క పోలీసూ వాళ్లు చేయాలనుకున్నది చేసే వరకూ ఆపలేదు. అక్కడా దాడులు చేసింది అధికార పార్టీ... ఇక్కడా దాడులు చేసింది అధికార పార్టీనే. అందుకే పోలీసులు సహకరించారని అనుకోవాలి. అసలు పోలీసులు తమ విధుల్లో మౌలికమైన విధి మర్చిపోయారని బాధపడాలా ? అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో విచక్షణ కోల్పోయి విపక్ష నేతలను కొట్టడం.. ఇళ్లపై దాడులు చేయడం తప్పు లేదనుకునే స్థితికి అసహనం వెళ్లిపోయిందని ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి. 


విమర్శలు చేస్తే భరించలేకపోతున్న అధికార పార్టీలు !


ఏపీలో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ఓ మాట అన్నారు. అది జన బాహుళ్యంలో ఎక్కువగా వినిపించే మాటే. అయితే ఆ పదాన్ని అత్యంత బూతుగా అన్వయించుకున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు.. దాడులకు తెగబడ్డారు.  పట్టాభిరాం ఇంటిపై దాడి చేశారు. టీడీపీ కార్యాలయంపైనా దాడి చేశారు. తర్వాత పోలీస్ మీట్‌లో పాల్గొన్న సీఎం జగన్ ఆ పదానికి అర్థం ఇదంతూ  ఓ దారుణమైన బూతు మాట చెప్పారు. కానీ ఆ పదానికి అర్థం అది కాదని అందరూ ముక్త కంఠంతో తేల్చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగా దాడులు చేయాలని అనుకున్నారని.. అధికారం తమ చేతుల్లో ఉంది కాబట్టి కొట్టాలని.. దాడులు చేయాలని అనుకున్నారన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. స్వయంగా జగన్ తమను అంటే.. తమ అభిమానులకు బీపీ వస్తుందని స్వయంగా సమర్థించారు. అలా ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయడం..అదే మొదటి సారి కాదు. చివరి సారి కాదు. అక్కడ స్వయంగా పోలీసులే ప్రశ్నించే ప్రతిపక్ష నేతల్ని తప్పుడు కేసులతో అర్థరాత్రి అపహరించి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో టచ్‌లో కవిత ఉన్నారని .. దర్మపురి అర్వింద్ చేసిన విమర్శలపై టీఆర్ఎస్‌కు కోపం వచ్చింది. ఉన్న పళంగా ఇంటిపై దాడి చేసేశారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. చంపుతాం.. చెప్పుతో కొడతాం..  మెత్తగా కొడతాం అని హెచ్చరించారు. దీంతో దాడుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 


అధికార పార్టీ నేతలు  విమర్శల పేరుతో బూతులు తిట్టినా ఒప్పేనా ?


అయితే ఇక్క రాజకీయాల్లో చెప్పాల్సింది...పరిశీలించాల్సింది ఏమిటంటే..  అదే విపక్ష నేతల్ని అధికార పార్టీల నేతలు ఎన్ని మాటలైనా అనవొచ్చు. కుటుంబాలకు అక్రమ సంబంధాలు అంటగట్టి విమర్శలు చేయవచ్చు. అడ్డగోలుగా తిట్టవచ్చు. అలా వారు చేసే రోత  విమర్శలను ఆ ఆధికార పార్టీలో ఎవరూ వ్యతిరేకించరు. పైగా ఏపీలో అయితే పదవులు కూడా ఇస్తారన్న సెటైర్లు ఉన్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడా అధికార బలం లేదు. అందుకే వారిని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా తిడతారు. వారు తిరిగి తిడితే .. అయితే క్యాడర్‌తో దాడులు చేయించడం.. లేకపోతే.. పోలీసు కేసులతో కొట్టించడం చేస్తారు. తెలంగామలో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో విపక్షం అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అందుకే.. టీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకూ ఆచితూచి ఉన్నారు కానీ ఇప్పుడు కూడా వారు .. రాష్ట్రంలో తమది అధికారం కాబట్టి .. తాము ఎన్నైనా అంటాము.. తమను అంటే మాత్రం కొడతామని మీదకు వచ్చేస్తున్నారు. ధర్మపురి అర్వింద్ విషయంలో జరిగింది అదే. కేసీఆర్ యుద్ధం ప్రకటించిన తర్వాత ఇలా జరగడంతో ఇక ముందు ఏపీ తరహాలో విపక్షాలపై అధికార పార్టీ దాడులు ఉండవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 


అధికార పార్టీలు అసహనంతో బాధ్యత మరిచిపోతున్నాయా ?


అధికార పార్టీ అంటే ఓ బాధ్యత ఉంటుంది. ప్రజలకు భద్రత కల్పించాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేతలపై ఎలాంటి దాడులు జరగకుండా గతంలో ప్రభుత్వాలు చూసుకుంటాయి. ఎందుకంటే ఎలాంటి దాడి జరిగినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. చెడ్డ పేరు వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పుకుంటారు కానీ ఇటీవలి కాలంలో అధికార పార్టీల్లో ఆ స్ప్రహ మారిపోయింది. ఎలా చేసినా తమ ఓటు బ్యాంక్ తమను సమర్థిస్తుందని.. గట్టిగా నమ్ముతున్నారు. విపక్ష నేతలపై దాడులు చేస్తే వారిలో జోష్ వస్తుందని అనుకుంటున్నారేమో కానీ దాడులకు వెనుకడుగు వేయడం లేదు. ఏపీలో విపక్షాల్ని అణచివేసే క్రమంలో అక్కడి పోలీసుల తీరు తీవ్ర అక్షేపణీయంగా మారింది. తెలంగాణలోనూ ఇప్పుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై జరిగిన దాడి తర్వాత.. పోలీసుల తీరుపై విమర్శలు రావడం సహజమే. 


రేపు అధికారం మారితే  అంతకు మించి చేస్తారు... ఇది రాజకీయ విలువల పతనానికి దారి తీయడమే !


ఇవాళ అధికారంలో ఉన్న వారు రేపు అధికారంలో ఉంటారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. ఇలాంటి సమయంలో అధికారం మారిన తర్వాత.. దాడులకు గురైన వారు ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటారా ?. అలా ఉంటే.. చేతకాని వాళ్లన్న ముద్ర వేస్తారు. వారు అధికారంలో ఉన్నప్పుడు చేశారు కాబట్టి.. మనం అంతకు మించి చేయాలన్న ఒత్తిడి ఉంటుంది. చేస్తారు. ఏమైనా అంటే.. నీవు నేర్పిన విద్యయేగా నీరజాక్ష అంటారు. అప్పుడు బాధితులకు ఓదార్పు కూడా లభించదు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు అక్కడి వరకూ ఆలోచించడం లేదు. ఇప్పుడు దాడులు చేసి విపక్షాల్ని భయపెడతాం.. అన్నదగ్గరే ఆలోచిస్తున్నాయి. కానీ ఇది రాబోయే రోజుల్లో మరింత ఉద్రిక్త రాజకీయాలకు కారణం అవుతుంది. విలువ పతనానికి కేంద్రంగా మారుతుంది. అప్పుడు బాధితులు అన్ని పార్టీల వాళ్లవుతారు.. రాజకీయ నేతలే అవుతారు. ఈ విషయం గుర్తించలేకపోతున్నారు.