Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ వివాదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని తరచూ బయటపడుతోంది. తాజాగా రాహుల్ గాంధీ ఖమ్మం బహిరంగసభలో ప్రసంగించేందుకు రెండో తేదీన వస్తున్నారు. ఇందు కోసం కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇందు కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయన తరపున సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఓ పోస్టర్ ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే అందులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం వివాదాస్పదం అవుతోంది.
టీ పీసీసీ చీఫ్ పదవి రేవంత్ కు ఇవ్వడం ఇష్టం లేదన్న కోమటిరెడ్డి
టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని చేయడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇష్టం లేదు. రేవంత్ కు పదవి ఇచ్చిన తర్వాత చాలా కాలం పాటు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా ఆయనకు రెండు సార్లు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. మునుగోడు ఉపెన్నికల సందర్భంగా బీజేపీ తరపున పోటీ చేసిన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు.
ఇటీవల రేవంత్‌తో కలిసి పని చేస్తున్నట్లుగా ప్రకటనలు
కాంగ్రెస్ లోనే ఉంటానని.. రేవంత్ రెడ్డితో సహా ఎవరితోనూ విభేదాల్లేవని చెబుతున్నారు. కలిసి పని చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో .. రేవంత్ రెడ్డితో కలిసి కనిపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరికల అంశంపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్లారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో పార్టీ పరంగా వేస్తున్న పోస్టర్లలో... టీ పీసీసీ చీఫ్ ఫోటోను తీసేయడం వివాదాస్పదం అవుతోంది.
ఎలాంటి దుమారం రేగుతుందో ?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి తెలియకుండా ఇలాంటి పోస్టర్లు రెడీ చేసే చాన్స్ ఉండదని.. ఆయనే ఉద్దేశపూర్వకంగా తీయించారని కాంగ్రెస్ లోని ఓ వర్గం చెబుతోంది. లేకపోతే... మొదటి ప్రయారిటీగా టీ పీసీసీ చీఫ్ ఫోటోను వేస్తారని ఇప్పటికీ ఆయనను టీ పీసీసీ చీఫ్‌గా గుర్తించడానికి కోమటిరెడ్డి రెడీగా లేరన్న వాదన వినిపిస్తోంది. అందుకే ఫోటో వేయనివ్వలేదంటున్నారు. ఈ అంశం కాంగ్రెస్ లో ఎలాంటి దుమారం రేపుతుందో చూడాల్సి ఉంది.