TS Governer :   బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల మృతిపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివేదిక ఇవ్వాల‌ని బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీ వెంకటరమణను ఆదేశించారు.  48 గంటల్లో నివేదిక ఇవ్వాలని్నారు.  దురదృష్టకర ఘటనల నివారణకు చేపట్టిన చర్యలపై నివేదిక కూడా స‌మ‌ర్పించాల‌ని గవర్నర్ స్పష్టం చేశారు.  విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె కోరారు.. బాసర ట్రిపుల్ ఐటీలో వరుస ఆత్మహత్యాలపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్ చాన్సలర్ కు గవర్నర్ సూచించారు. విద్యార్ధుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. ఉన్నత విద్యను అభ్యసించి సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్దం కావాలన్నారు. 


బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితమే యూనివర్సిటీలో దీపిక అనే విద్యార్థిని బాత్‌ రూంలో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఆ ఘటనను మరువక ముందే అనుమానాస్పద స్థితిలో హాస్టల్‌ భవనం పై నుంచి మరో విద్యార్థిని చనిపోయింది.  ఇద్దరు విద్యార్థినులు కూడా ప్రీ యూనివర్సిటీ కోర్సు  మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత  హాస్టల్‌ భవనం నాలుగో అంతస్థు నుంచి కింద పడింది. గమనించిన ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది వెంటనే ఆమెను క్యాంప్‌సలోని ఆస్పత్రికి.. తర్వాత భైంసాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో.. నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లిఖిత మృతి చెందింది. 


భవనం పై నుంచి పడటంతో ఆమె వెన్నుపూసకు బలమైన గాయాలయ్యాయి.   లిఖిత మృతికి కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. ఆమె యూట్యూబ్‌ చూస్తూ ప్రమాదవశాత్తు భవనం సైడ్‌ వాల్‌ పై నుంచి కింద పడిందని, విద్యార్థినిది ఆత్మహత్య కాదని వీసీ వెంకటరమణ ప్రకటించారు.  కుక్కలు వెంట పడటంతో లిఖిత భయంతో భవనం పైకెక్కిందని, అక్కడి నుంచి కింద పడిపోయిందని మరికొంత మంది చెబుతున్నారు.                                         


క్యాంప్‌సలో విద్యార్థులు చనిపోతున్నా.. ట్రిపుల్‌ ఐటీ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం.. మరణాలకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీని సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే వరుస ఘటనలపై అధికారులు విచారణ జరిపి కేసులు దులుపుకుంటున్నారే తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారం రోజుల క్రితమే విద్యార్థుల స్టడీ మెటీరియల్‌ను సిబ్బంది బయట పడేసిన వ్యవహారం వివాదాస్పదమైంది. ఇంతలోనే క్యాంప్‌సలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. గత ఏడాది రాథోడ్‌ సురేష్‌, భాను ప్రసాద్‌ అనే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.మెస్‌లో పురుగుల అన్నం పెడుతున్నారని, కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా గవర్నర్ నివేదిక కోరడంతో..  వీసీ ఎం చెబుతారోనన్న ఆసక్తి ఏర్పడింది.