Liquor Scam Politics : ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం అక్కడ కన్నా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ లిక్కర్ సిండికేట్లకు నిధులన్నీ తెలంగాణ నుంచే వెళ్లాయని సీబీఐ, ఈడీ కంటే ముందే బీజేపీ నేతలు ఆరోపించారు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి అదే నిజమనించేలా చేస్తున్నాయి. అయితే ఇందులో వ్యాపార కోణమే ఉంటే సమస్యే ఉండదు. కానీ ఇక్కడంతా రాజకీయమే ఉంది. అన్ని లింకులు రాజకీయ నేతల వద్దే కనిపిస్తున్నాయి. అందుకే ముందు ముందు ఈ అంశం రాజకీయంగా కీలక మార్పులకు కారణం అవుతుందన్న ప్రచారం ఊపందుకుంటోంది.
తెలంగాణ రాజకీయవర్గాల్లో ఈడీ దాడుల ప్రకంపనలు!
ఓ సారి ఈడీ బృందాలు వచ్చి సోదాలు చేసి వెళ్లాయి. కొంత మంది హమ్మయ్య అనుకున్నారు. ఇలా అనుకునేలోపే రెండో బృందం వచ్చింది. అప్పుడు కూడా చాలా మంది రిలాక్సయ్యారు. కానీ మూడో బృందం సోదాలకు వచ్చిన తర్వాత మాత్రం అసలు సీన్ ప్రారంభమయింది. తెలంగాణ రాష్ట్ర సమతి కీలక నేతలకు సన్నిహితుడిగా పేరు పొందిన వెన్నమనేని శ్రీనివసరావు లావాదేవీలన్నీ బయటకు లాగడం.. కొంత మంది టీఆర్ఎస్ నేతలకు వ్యక్తిగత ఆడిటర్‌గా ఉన్న గోరంట్ల బుచ్చిబాబు దగ్గర దొరికిన డాక్యుమెంట్లతో ఈడీ మొత్తం గుట్టు పట్టేసిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దలకు బంధువు అయిన ఓ ఫార్మా కంపెనీ యాజమాన్యంలో కీలక వ్యక్తినీ ఈడీ ఢిల్లీ తీసుకెళ్లి మరీ ప్రశ్నిస్తోందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో తెలంగాణ రాజకీయం పేలడానికి సిద్ధంగా ఉన్న ఓ బబుల్‌గా ... గుంభనంగా ఉంది.
టీఆర్ఎస్‌తో మైండ్ గేమ్ ఆడుతున్న బీజేపీ నేతలు !
ఈడీ దాడులు.. బయట జరుగుతున్న ప్రచారాన్నే ఆలంబనగా చేసుకుని బీజేపీ నేతలు టీఆర్ఎస్‌తో మైండ్ గేమ్ ఆడుతున్నారు. రెండు మూడు రోజుల్లో కీలక వ్యక్తులకు నోటీసులు వస్తాయని విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేస్తారని కటకటాలు తప్పవని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పేశారు. ఆయన చెప్పినట్లుగా జరుగుతుందో లేదో కానీ.. ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి.. ఎవరూ తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఒక్క ధర్మపురి అర్వింద్ మాత్రమే కాదు.. బీజేపీ ముఖ్య నేతలందరూ అవే విమర్శలు చేస్తున్నారు. మనీలాండరింగ్‌లో కీలక నేతల గుట్టు అంతా ఈడీ గుప్పిట్లో ఉందని.. జైలుకు పోక తప్పని హెచ్చరిస్తున్నారు.
ఆత్మరక్షణ ధోరణిలో టీఆర్ఎస్ !
బీజేపీ నేతల విమర్శలకు టీఆర్ఎస్ ఘాటుగా సమాధానం చెప్పలేకపోతోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఇతర విషయాల్లో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎవరూ స్పందించడం లేదు. కానీ ప్రధాని మోదీని విధాన పరంగా విమర్శించడానికి మాత్రం ముందు ఉంటున్నారు. కేటీఆర్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు నేరుగా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇతర పార్టీ నేతలు మాత్రం గుంభనంగా ఉంటున్నారు. బీజేపీ విషయంలో ఎలా డీల్ చేయాలో.. ముఖ్యంగా లిక్కర్ స్కాం.. ఈడీ దాడుల విషయంలో ఎలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోతున్నారు.
దేశ రాజకీయాల్లో ఇప్పుడు దర్యాప్తు సంస్థల పాత్రను ఎవరూ కాదనలేరు. రాజకీయాలకు అతీతంగా ఆ సంస్థలు సోదాలు జరుపుతూ ఉండవచ్చు కానీ సోదాల పరిణామాలు మాత్రం రాజకీయ మార్పులకు కారణం అవుతున్నాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇవి ఎలాంటి మార్పులకు కారణం అవుతాయన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి!