KCR Vs Modi : ప్రదానమంత్రి నరేంద్రమోడీ 12వ తేదీన తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతోే కేంద్ర ప్రభుత్వ వర్గాలు .. ఈ ఆరోపణల్ని ఖండించాయి. రామగుండం ప్లాంట్ సీఈవో స్వయంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పంపిన ఆహ్వానలేఖను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించారన్నారు. ఈ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు.
ప్రోటోకాల్ వివాదాన్ని లేవనెత్తిన టీఆర్ఎస్
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే ఈ ఈవెంట్ కోసం పంపిన ఆహ్వానంలో కేంద్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ను పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణలో అధికారిక భాగస్వామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానించిందని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ పేరు తర్వాత అతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పేరును చేర్చలేదని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న ఫ్యాక్టరీ ఈవెంట్లో సీఎంకు నామమాత్రంగా ఆహ్వానం పంపి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని తమ ట్వీట్లో పేర్కొన్నారు.
కేసీఆర్ పాల్గొనే విషయంపై సందిగ్ధత
గతంలో తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చిన ప్రతి సందర్భంలోనూ సీఎం కేసీఆర్ ఆ కార్యక్రమాలకు హాజరుకాలేదు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ప్రధాని మోదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకింతం చేసే కార్యక్రమానికి సైతం సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
మోదీ పర్యటనను అడ్డుకుంటామని పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. తెలంగాణ అభివృద్ధికి అనేక హామీలిచ్చిన కేంద్రం వాటిని నెరవేర్చడం లేదని ఆరోపించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకే రాష్ట్రంలో మోదీ పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. 2021 నుంచే రామగుండం ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించిందని, అప్పటి నుంచి సుమారు పది లక్షల టన్నులకు పైగా ఎరువుల ఉత్పత్తి సరఫరా అవుతుందన్నారు.ప్రజలను మభ్యపెట్టేందుకు పాత ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు రాష్ట్రానికి రావడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. దీంతో మోదీ పర్యటన ఉద్రిక్తల మధ్య సాగే అవకాశం కనిపిస్తోంది.