Raja singh PD Act :  గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్టు సమర్థించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. తనపై నమోదు చేసిన పీడీయాక్ట్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిని కమిటీ తిరస్కరించింది. రాజాసింగ్ పై 101కేసులు ఉన్నాయని వాటిలో 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని పోలీసులు అడ్వైజరీ కమిటీ దృష్టికి తెచ్చారు. అందుకే పీడీ యాక్ట్ నమోదుచేసినట్లు చెప్పారు తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేసినట్టుగా రాజాసింగ్ బోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కమిటీ సభ్యులు పోలీసుల వాదనతో ఏకీభవించారు. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించారు. దీంతో రాజాసింగ్ జైల్లోనే గడపక తప్పని పరిస్థితి ఏర్పడింది. 


పీడీ యాక్ట్‌ విధింపుపై హైకోర్టును ఆశ్రయించిన రాజాసింగ్ సతీమణి


మరో వైపు  పీడీ యాక్ట్ నమోదును వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా బాయి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను అరెస్ట్ చేసే సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. తన భర్తను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి సంబంధించిన పత్రాలు హిందీలో లేవని పిటిషన్ లో పేర్కొన్నారు.  అడ్వైజరీ కమిటీకి లిఖితపూరక సమాధానం ఇవ్వడానికి హైదరాబాద్ పోలీసులు తనకు అవకాశం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శితో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరగనుంది. 


ఆగస్టు 25 నుంచి  పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్న రాజాసింగ్ 


ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీ 


రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియోలో  మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద  వ్యాఖ్యలు చేసినందున రాజాసింగ్ ను బీజేపీ నుండి సస్పెండ్ చేశారు.  15 రోజుల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను బీజేపీ ఆదేశించింది. అయితే పీడీ యాక్ట్ తో  జైలులో ఉన్నందున  వివరణకు మరింత సమయం ఇవ్వాలని రాజాసింగ్ భార్య ఉషాబాయ్  కోరారు. ఇటీవల జైలు నుంచే  బీజేపీ నాయకత్వానికి  సమాధానం పంపారు రాజాసింగ్.  దీనిపై బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.