TGSRTC Good News To Passengers: ప్రయాణికులకు టీడీఎస్ఆర్టీసీ (TGSRTC) శుభవార్త అందించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express) బస్ పాస్ కలిగిన ప్రయాణికులు తమ వద్ద ఉన్న పాస్‌లతో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ - గరుడ తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌పై 10 శాతం రాయితీ పొందొచ్చని తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్పోర్ట్ పుష్పక్ బస్ పాస్ కలిగిన ప్రయాణికులు ఈ రాయితీ పొందొచ్చు. వచ్చే ఏడాది జనవరి 31 వరకూ ఈ 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని వెల్లడించారు.
కాగా, హైదరాబాద్ నగరంలో సుమారు 70 వేల వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌లు ఉన్నాయి. ఈ పాస్‌లు కలిగి ఉన్న వారు వీకెండ్లో సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ పాసులు కలిగి ఉన్న వారి సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ http://tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీ పొందొచ్చని వెల్లడించింది. జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించింది.