Group 2 : తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ఒకవైపు పోస్టులు తక్కువగా ఉన్నాయని, ప్రిపరేషన్ కు సమయం కూడా లేదని, డీఎస్సీ, గ్రూప్స్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నిరుద్యోగ అభ్యర్థులు.. అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ ల దగ్గర కూడా భారీ ఎత్తున ఆందోళన చేశారు. పోస్టులు సంఖ్యలను పెంచి, కొత్త నోటిఫికేషన్ లు వేయాలని కూడా అనేక పర్యాయాలు ప్రభుత్వానికి తమ గోడును వెల్లబోసుకున్నారు. దీనిలో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థులు నిరసనలు తెలియజేశారు.
గ్రూప్స్ అభ్యర్థులు అరెస్ట్
ఈ క్రమంలోనే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. గ్రూప్2, 3 పోస్టులను పెంచాలని గ్రూప్-2 ను డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లైబ్రరీ గేటు కి లాక్ వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో లైబ్రరీ లోనే అభ్యర్థులు ఆందోళన కొనసాగించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
త్వరలోనే మరో డీఎస్సీ
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా విద్యార్థుల పట్ల కాస్త సెటైరికల్ గా స్పందించారు. నిరుద్యోగులు ఇంకా ఆలస్యం చేస్తే బెండకాయల్లా ముదిరిపోతారంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. గ్రూప్స్, డీఎస్సీ ఎగ్జామ్స్ ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ కోర్టు సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి ఒక వైపు నిరుద్యోగులు రోడ్లమీద వచ్చే కంటే కూడా.. మంత్రులతో తమ ఇబ్బందులు ఏంటో చెప్పుకోవాలని సూచించారు. మరోవైపు మంత్రి సీతక్క మాత్రం నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. త్వరలోనే మరో డీఎస్సీ ఉంటుందని, నిరుద్యోగులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పడాల్సిన అవసరం లేదని కూడా నిన్న తెల్చి చెప్పారు.
సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నం
నిరుద్యోగుల ఆందోళనలు ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు.. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు, బీ.సీ. జనసభ నేతలు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిరుద్యోగ సంఘం నేతల్ని, విద్యార్థి సంఘం నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్ లను రెడీగా ఉంచుకున్నారు. ఈ క్రమంలో కొందరు సచివాలయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. వెంటనే అక్కడున్న పోలీసులు వారి అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. అదే విధంగా..డీఎస్సీ, గ్రూప్స్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు.
భారీగా అరెస్టులు
సచివాలయం పరిసరాల్లో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. జిల్లాల నుంచి తరలి వస్తున్న సంఘాల నాయకులను ఎక్కడిక్కడ అరెస్ట్‌లు చేశారు. అశోక్‌నగర్ క్రాస్ రోడ్డులో, దిల్ సుఖ్ నగర్ ల నుంచి నిరుద్యోగుల వస్తున్నారని పోలీసులు నిఘా పెంచారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు తక్షణం చేపట్టాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవాలనే డిమాండ్లతో సెక్రటేరియట్ ముట్టడికి బీసీ నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సచివాలయం దగ్గర హైడ్రామా నెలకొంది.