Flyover renamed as Telangana Talli but masked the board: 'తెలుగు తల్లి ఫ్లైఓవర్' పేరును 'తెలంగాణ తల్లి ఫ్లైఓవర్'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 30 రాత్రి సచివాలయం సమీపంలోని ఈ ఫ్లైఓవర్ వద్ద కొత్త బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే మంగళవారం సాయంత్రానికే ఆ బోర్డును బ్లూ కలర్ గుడ్డతో, తెల్లటి పేపర్‌తో కప్పేసింది. ఈ విషయం తెలంగాణలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం వివాదాలకు భయపడి వెనక్కి తగ్గిందా? లేక అధికారికంగా ప్రారంభించడానికి అలా చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సచివాలయం, హైటెక్ సిటీలను కలిపే కీలక మార్గంగా 'తెలుగు తల్లి ఫ్లైఓవర్' ప్రసిద్ధి. చంద్రబాబు హయాంలో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్, తెలుగు సాహిత్యం, సంస్కృతి ప్రతీకగా సమీపంలో తెలుగుతల్లి విగ్రహం ఉండటంతో 'తెలుగు తల్లి' పేరుతో గుర్తింపు పొందింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఈ పేరు కొనసాగింది. కొత్త సెక్రటేరియట్ నిర్మించిన తర్వాత తెలుగుతల్లి విగ్రహాన్ని కేసీఆర్ హయాంలో అక్కడి నుంచితొలగించారు. మళ్లీ ఏర్పాటు చేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ గుర్తింపును బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పేరు మార్పు ప్రతిపాదనలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) బోర్డు ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపింది. సోమవారం రాత్రి ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద 'తెలంగాణ తల్లి ఫ్లైఓవర్' అని రాసిన కొత్త సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఏం జరిగిందో కానీ మంగళవారం సాయంత్రానికే ఆ బోర్డు కనిపించకుండా పోయింది. స్థానికులు, సోషల్ మీడియా యూజర్లు షేర్ చేసిన ఫోటోల ప్రకారం, బోర్డును బ్లూ కలర్ గుడ్డతో కప్పేసి, మీద తెల్లటి పేపర్ అతికించారు. కేటీఆర్ పార్టీ సోషల్ మీడియా ద్వారా రేవంత్ ప్రభుత్వాన్ని 'తెలంగాణ గుర్తింపును అవమానిస్తున్నారు' అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. కానీ కొంత మందిగ్రేటర్ అధికారులు మార్పులు చేస్తున్నామని సైన్ బోర్డు రెడీ అవగానే పెడతామన్నారు.