Minister Jagadish Reddy: ‘‘తెలంగాణ కరెంటు 24 గంటలు ఉండడం లేదని ప్రచారం చేస్తున్నారు. కరెంట్ ఉందో లేదో వైర్లు పట్టుకుందామా? ముందు మీరు పట్టుకోండి బతికి ఉంటే నేను పట్టుకుంటా? అలాగే కర్ణాటకలో కూడా చూద్దాం’’ అని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని.. నీచంగా దిగజారుడు తనంగా అతని భాషగా ఉందని అన్నారు. మంత్రి జి. జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో ప్రెస్ మీట్ నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి జి. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాజకీయాలు దిగజారుతున్నాయి. కొన్ని పార్టీలు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇష్టానుసారం అబద్ధాలు, బూతు పదాలు వాడుతున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. నీచంగా దిగజారుడు తనంగా అతని భాషగా ఉంది. ఒక నాయకుడు మాట్లాడే మాటలు ఇవేనా? టిక్కెట్లు ఇవ్వలేని స్థితిలో వాటిని అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్పుకొని ప్రజలను ఓట్లు అడగచ్చు. అంతేకానీ, నిందలు పనికిరావు.


కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వాడిన భాష ను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తక్షణమే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ కంటే మా రాష్ట్రంలో గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పాలి. కర్ణాటకలో ఇచ్చే కరెంట్ కూడా 3 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నాం అని చెప్తారా? కాంగ్రెస్ వల్ల తెలంగాణ నాశనం అయ్యింది. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేస్తోంది. నోటికొచ్చిన అబద్ధాలు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.


కరెంటు వైర్లు పట్టుకుందామా?


కరెంట్ లేదని ప్రచారం చేస్తున్నారు. కరెంట్ ఉందో లేదో వైర్లు పట్టుకుందామా? ముందు మీరు పట్టుకోండి బతికి ఉంటే నేను పట్టుకుంటా? అలాగే కర్ణాటకలో కూడా చూద్దాం. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీరు ఏరికోరి తెచ్చుకున్న పీసీసీ చీఫ్ ఇలా మాట్లాడితే సమర్థిస్తారా?’’ అని జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు.


ఇవాళ టికెట్లు అమ్ముకున్న వ్యక్తి రేపు రాష్ట్రానికి సీఎం అయితే రాష్ట్రాన్ని ఏం చేస్తారో ప్రజలు గమనించాలి. బ్రోకర్ పనులు చేసి వచ్చిన వ్యక్తులు పీసీసీ చీఫ్ అయితే ఇలాగే ఉంటుంది. దళిత నేతల దగ్గర కూడా టికెట్ కోసం డబ్బులు తీసుకున్నాడు. ఎన్నికలు అన్నప్పుడు పోటీ ఉంటుంది. అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. బీజేపీకి నాలుగు ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఒక్క సీటు కూడా గెలిచే స్థితి లేదు కాబట్టి మోదీ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారు. ఇలా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేక కేసీఆర్ పైన ఆరోపణలు చేయటం పనిగా పెట్టుకున్నారు’’ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు.