తెలంగాణలో వైట్ ఛాలెంజ్ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరారు. తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన వైట్ ఛాలెంజ్ ఇప్పుడు బండి సంజయ్ వద్ద ఆగింది. డ్రగ్స్ వాడకూడదని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రజా ప్రతినిధులు ముందుగా టెస్టులు చేయించుకోవాలని రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. దీనిపై స్పందించిన కొండా రేవంత్ రెడ్డి కోరినట్లుగా రక్త పరీక్షల కోసం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు సోమవారం వచ్చారు. కానీ కేటీఆర్ మాత్రం రాహుల్ డ్రగ్స్ టెస్టుకు రెడీ అయితే తాను రెడీ అని ప్రకటించారు. రేవంత్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పరువు నష్టం దావా కూడా దాఖలు చేశారు.
బండి సంజయ్ స్పందన
తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో ఇద్దర్ని నామినేట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ పై బండి సంజయ్ స్పందించారు. బలిసిన వారు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారని, పేదోడికి అవసరం లేదని బండి సంజయ్ అన్నారు. మాజీ ఎంపీ కొండా మంచోడన్న ఆయన, తన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2తో తన పాదయాత్ర ముగిస్తుందన్న బండి.. ఆ వెంటనే ఎక్కడికి రమ్మంటే అక్కడకి వస్తానని ప్రకటించారు.
Also Read: Tollywood drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ నిజాలు చెప్పడం లేదా? ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన
కేటీఆర్ స్థాయి పెరిగేది
రేవంత్ రెడ్డి తనకు, కేటీఆర్‌కు ఛాలెంజ్ విసిరారని కొంతమంది ఫోన్ చేసి చెప్పారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనాలని గన్‌పార్క్ వద్దకు వచ్చానన్నారు. వైట్ ఛాలెంజ్ సమాజానికి మంచిదేనన్న ఆయన... నాయకులు, సెలబ్రిటీలు అందరూ ముందుకొస్తే సమాజానికి మంచి మెసేజ్ వెళ్తుందన్నారు. కానీ కేటీఆర్ ఈ ఛాలెంజ్ స్వీకరించేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. పైగా కేటీఆర్ చెబుతున్న కారణాలు విచిత్రంగా ఉన్నాయన్నారు. కేటీఆర్ ఇక్కడికి వస్తే ఆయన స్థాయి పెరిగేదని కొండా అన్నారు.
Also Read: White Challenge : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?