ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. సంపర్క్​ సే సంవర్ధన్​లో భాగంగా బ్యాండ్మిటన్​ క్రీడాకారిణి పీవీ సింధులో అమిత్ షా, కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పీవీ సింధుతో భేటీ అనంతరం అమిత్ షా స్పందించారు. సింధు అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేసిందన్నారు. ఆట పట్ల ఆమె నిబద్ధత, చేసిన కృషి, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ ట్వీట్ చేశారు.


అంతకుముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతం పలికారు.  రేపు ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి అమిత్ షా దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌, ఈటల తదితర నాయకులతో అమిత్ షా సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 


మరోవైపు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పాటించాలని కేసీఆర్‌ చెప్పడం.. హాస్యాస్పదమని కిషన్‌ రెడ్డి విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని బీజేపీ సభగా హైదరాబాద్‌ పోలీసులు సర్కులర్‌ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్క్యులర్‌ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలని కిషన్​రెడ్డి డిమాండ్‌ చేశారు. 






ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయ్. ఎన్నికలకు మరో రెండు నెలలే సమయం మాత్రమే ఉండటంతో... రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సెప్టెంబరు 17 లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అన్ని ప్రధాన పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, జాతీయ జెండాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేయబోతున్నాయి. తెలంగాణలో ఏటా సెప్టెంబర్‌ 17పై వివాదం సాధారణంగా మారుతోంది. గతేడాది మునుగోడు ఉపఎన్నికల తరుణంలో సెప్టెంబర్ 17పై విస్తృత చర్చ జరిగింది. స్వయంగా కేంద్రం రంగంలోకి దిగి విమోచన దినోత్సవం జరుపుతోంది. కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా జాతీయ సమైక్యత దినం జరుపుతోంది. నిజానికి తెలంగాణ ఏర్పాటైన దగ్గర్నుంచీ సెప్టెంబర్‌ 17ను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో జరుపుతూ వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించలేదు. ఏటా సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా.. విలీనమా, విమోచనా.. విద్రోహమా అనే చర్చ జరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా జరుపుతున్నట్టు స్పష్టం చేసింది.


సెప్టెంబర్ 17కు స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1948లో ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది. ఆపరేషన్ పోలోలో భాగంగా సైనిక చర్యతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను గద్దె దించి, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజుని కొందరు విమోచనం అంటారు. మరికొందరు విలీనం అంటున్నారు. ఇంకొందరు విద్రోహం అని పిలుస్తున్నారు.