Telangana Pavilion at WEF 2024: హైదరాబాద్/దావోస్: అంతర్జాతీయ వేదిక మీద రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భాగంగా పలువురు ప్రముఖులను రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు ప్రభుత్వ సహకారాన్ని వివరిస్తున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు జనవరి 18 వరకు జరగనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 


తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్‌ తెలంగాణ పేరుతో చేపట్టిన క్యాంపెయిన్‌ను ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సక్సెస్ చేసే పనిలో రేవంత్ టీమ్ బిజీగా ఉంది. దావోస్​లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్.. వేర్ ట్రెడిషన్​మీట్స్​ఇన్నోవేషన్​ట్యాగ్ లైన్‌తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హోర్డింగ్​ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పేలా బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్​ను పెవిలియన్ లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. 


వీటితో పాటు మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్​, పోచంపల్లి ఇక్కత్​చీరలు, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్​.. స్కైరూట్ ఏరోస్పేస్..  విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్​డిజైనింగ్​ ఈ పెవిలియన్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటి చెప్పటంతో పాటు.. ‘ఇన్ వెస్ట్ ఇన్​ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ కు విశేష స్పందన లభించింది. ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ, ‘పెట్టుబడులకు దేశంలోనే తొలి గమ్యస్థానం తెలంగాణ అనే నినాదాలు పెవిలియన్​కు స్వాగతం పలుకుతున్నాయి. 


సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు, జీవ వైద్య రంగానికి  డేటా సైన్స్​ జోడీ, ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత..  పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న పాజిటివ్ అంశాలను ఇంగ్లీష్​కోట్స్​తో తెలంగాణ పెవిలియన్‌లో ప్రదర్శించారు.


UNFPA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కానెమ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్రెసిడెంట్‌ బోర్గోబ్రెండేతో సోమవారమే రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇతర ప్రముఖులతో కూడా భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనలు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో చేపట్టబోయే కార్యక్రమాలు వివరించారు. అంతకుముందు స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయంలోనే ప్రవాసీ తెలంగాణ ప్రముఖులతో రేవంత్ టీం చర్చలు జరిపింది. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి కోసం నవ తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేందుకు వారంతా మొగ్గు చూపారని రేవంత్ తెలిపారు. గత తొమ్మిదేళ్లు రాష్ట్ర ఐటీ మంత్రిగా కేటీఆర్ దావోస్ లో పర్యటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనకు వెళ్లారు.